Sake Sailajanath: అసలు నిర్మాణమే జరగని అమరావతికి పునర్ నిర్మాణం ఏంటి?: శైలజానాథ్

Amaravati Reconstruction Sake Sailajanath Questions Andhra Pradesh Government
  • కూటమి ప్రభుత్వంపై శైలజానాథ్ ఫైర్
  • అప్పులన్నీ తెచ్చి అమరావతికే ఖర్చు చేస్తున్నారని విమర్శలు
  • తద్వారా ప్రాంతీయ అసమానతలు పెంచుతున్నారని వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే కేవలం అమరావతి మాత్రమే కాదని, తరతరాలుగా వెనుకబాటుకు గురైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వైసీపీ నేత సాకే శైలజానాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను కేవలం అమరావతి నిర్మాణానికే ధారపోయడం ద్వారా ప్రాంతీయ అసమానతలను మరింత పెంచుతున్నారని ఆయన మండిపడ్డారు. అసలు నిర్మాణమే జరుపుకోని అమరావతికి పునర్ నిర్మాణం ఏంటని ప్రశ్నించారు.

గతంలో గ్రాఫిక్స్‌తో ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం, ఐదేళ్లలో తాత్కాలిక భవనాలు తప్ప రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టలేదని శైలజానాథ్ ఎద్దేవా చేశారు. రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న 34 వేల ఎకరాలను బీడుగా మార్చి, ఇప్పుడు మళ్లీ 44 వేల ఎకరాలు సేకరిస్తామని, రైతులు ఇవ్వకపోతే 'కష్టంగానైనా' తీసుకుంటామని మంత్రి నారాయణ బెదిరించడం దారుణమని అన్నారు. "ఒకపక్క బస్టాండ్ కట్టడానికి డబ్బుల్లేవంటారు.. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే ఉండగా, మళ్లీ అమరావతిలో ఎయిర్‌పోర్ట్ ఎందుకు?" అని ఆయన ప్రశ్నించారు.

"దేశంలో జాతీయ రహదారి కిలోమీటరు నిర్మాణానికి సగటున రూ. 20 కోట్లు ఖర్చవుతుంటే, అమరావతిలో మాత్రం కిలోమీటర్‌కు ఏకంగా రూ. 59 కోట్లు ఎలా ఖర్చవుతుంది? ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోతోంది?" అని శైలజానాథ్ నిలదీశారు. ఈ పనులకు టెండర్లు పిలవకుండా, కావాల్సిన వారికి నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడం వెనుక భారీగా కమీషన్ల బాగోతం నడుస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి ముంపు ప్రాంతమని, అందుకే రూ. 1100 కోట్లతో వరద నివారణ పనులు చేపట్టకపోతే రుణాలు ఇవ్వమని బ్యాంకులు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అంటే, తెలిసీ ముంపు ప్రాంతంలో రాజధాని కట్టడానికి వేల కోట్లు తగలేస్తున్నారని విమర్శించారు.

వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిని గాలికొదిలేసి, తెచ్చిన అప్పులన్నీ అమరావతికే ఖర్చు చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. తాము చేసిన ఆరోపణల్లో నిజం లేకపోతే, ప్రభుత్వం ఆధారాలతో సహా బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు.
Sake Sailajanath
Amaravati
Andhra Pradesh Capital
Chandrababu Naidu
YSRCP
Regional Disparity
Amravati Construction
Corruption Allegations
Andhra Pradesh Politics
State Debt

More Telugu News