Jamir Ahmed Khan: బాంబు ఇవ్వండి.. పాక్‌‌లో ఆత్మాహుతి దాడి చేస్తా.. కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు

Karnataka Ministers Controversial Remarks on Suicide Attack in Pakistan
  • సామాజిక మాధ్యమాల్లో మంత్రి వ్యాఖ్యలు వైరల్ 
  • పాకిస్థాన్ మనకు ఎప్పటికీ శత్రుదేశమేనన్న మంత్రి
  • ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతీయులంతా ఏకం కావాలని పిలుపు
 జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ కర్ణాటక మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పాకిస్థాన్‌పై ఆత్మాహుతి దాడికి తాను సిద్ధమని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

పహల్గామ్ దాడి ఘటన తరువాత నెలకొన్న పరిస్థితులపై మంత్రి మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ ఎప్పటికీ భారత్‌కు శత్రు దేశమే. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అంగీకరిస్తే.. ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధం. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు భారతీయులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

సర్జికల్ స్ట్రైక్స్‌పై రాజకీయ దుమారం
ఇదిలా ఉండగా గతంలో భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (పీవోకే) జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారం రేపాయి. ఆ దాడులకు ఆధారాలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారని వచ్చిన వార్తలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ‘మన వాయుసేన, సైన్యం సామర్థ్యాలను కాంగ్రెస్ నేతలు తక్కువగా అంచనా వేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆధారాలు కావాలంటే వారు పాకిస్థాన్‌కు వెళ్లి చూసుకోవచ్చు’ అని బీజేపీ నేత మజీందర్ సింగ్ సిర్సా ఘాటుగా బదులిచ్చారు. బీజేపీ నుంచి విమర్శలు రావడంతో చరణ్‌జీత్ సింగ్ చన్నీ వెనక్కి తగ్గారు. తాను ఆధారాలు అడగలేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యకైనా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన వివరణ ఇచ్చారు.

గత దాడులు.. ప్రతీకార చర్యలు 
2016 సెప్టెంబర్‌లో జమ్మూకశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లోని ఆర్మీ స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 19 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. దీనికి ప్రతీకారంగా అదే నెలలో భారత సైన్యం నియంత్రణ రేఖ దాటి పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రైక్స్) నిర్వహించింది. అనంతరం, 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా, భారత వాయుసేన పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై వైమానిక దాడులు జరిపిన విషయం విదితమే.
Jamir Ahmed Khan
Karnataka Minister
Pakistan
Suicide Attack
Surgical Strikes
Pulwama Attack
Pahalgham Attack
India-Pakistan Relations
Charanjit Singh Channi
Terrorism

More Telugu News