Air India: భారత్ లోనే 'టెక్నికల్ స్టాప్'... ఎయిరిండియా కీలక నిర్ణయం

Air India Plans Domestic Technical Stops for US Flights
  • గగనతల ఆంక్షలతో భారత్ నుంచి అరేబియా సముద్రం మీదుగా అమెరికాకు విమానాలు
  • ప్రయాణ గంటలు పెరగడం, అధిక ఇంధన వినియోగం, సిబ్బంది డ్యూటీ సమయం పెరగడం వంటి సవాళ్లు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలు
  • యూరప్, అమెరికా రూట్లలో తాత్కాలికంగా నెట్ వర్క్ సంబంధిత మార్పులు చాలా జరుగుతున్నాయన్న ఎయిరిండియా
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత విమానాలకు పాక్ గగనతలాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ నుంచి పలు దేశాలకు అరేబియా సముద్రం మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో భారత విమానాలు వెళ్తున్నాయి.

అమెరికాలోని వివిధ ప్రాంతాలకు ఎయిర్ ఇండియా వారానికి 71 సర్వీసులు నడుపుతుండగా ఇందులో 54 సర్వీసులు కేవలం ఢిల్లీ నుంచే ఉన్నాయి. అయితే అరేబియా సముద్రం మీదుగా సర్వీసులను నడపడంతో ప్రయాణ గంటలు పెరగడంతో పాటు అధిక ఇంధన వినియోగం, సిబ్బంది డ్యూటీ సమయం పెరగడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి.

ప్రధానంగా అమెరికా వెళ్లే ఎయిరిండియా విమానాలు ఇంధనం నింపడం కోసం ఐరోపాలోని వియన్నా (ఆస్ట్రియా), కోపెన్ హాగెన్ (డెన్మార్క్) నగరాలను టెక్నికల్ స్టాఫ్‌గా చూసుకుంటున్నాయి. దీంతో ల్యాండింగ్ చార్జీలు, ఇంధనం ఖర్చులతో భారీ వ్యయం అవుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే విమానాలకు భారత్‌లోనే టెక్నికల్ స్టాప్ ఉంటే బాగుంటుందని ఎయిర్ ఇండియా యోచిస్తోంది. ఇందు కోసం ముంబయి లేదా అహ్మదాబాద్‌లను ప్రత్యామ్నాయంగా చూస్తోంది. దీంతో యూరప్ నగరంలో ఆగాల్సిన పని లేకుండా నేరుగా అమెరికా చేరుకునే అవకాశం ఉంటుంది.

ఎయిర్ ఇండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ తాజా పరిణామాలకు సంబంధించి తమ సిబ్బందికి శుక్రవారం కీలక సమాచారం ఇచ్చారు. ఇటీవల గగనతల ఆంక్షల మూలంగా యూరప్, అమెరికా రూట్లలో తాత్కాలికంగా నెట్ వర్క్ సంబంధిత మార్పులు చాలా జరుగుతున్నాయని తెలిపారు. టెక్నికల్ స్టాప్ లను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో పురోగతి సాధించామని చెప్పారు. 
Air India
Technical Stop
India
US Flights
Fuel Efficiency
Campbell Wilson
Mumbai
Ahmedabad
Europe
Airline Route Changes

More Telugu News