Sunrisers Hyderabad: గుజరాత్ చేతిలో ఓటమి... సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు!

- అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ × సన్ రైజర్స్ హైదరాబాద్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగులు చేసిన గుజరాత్
- 225 పరుగుల లక్ష్యఛేదనలో 6 వికెట్లకు 186 పరుగులే చేసిన సన్ రైజర్స్
- 38 పరుగుల తేడాతో హైదరాబాద్ టీమ్ ఓటమి
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 38 పరుగుల తేడాతో ఓటమి ఎదురైంది. గుజరాత్ నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. యువ సంచలనం అభిషేక్ శర్మ (74) పోరాట పటిమ కనబరిచినా... అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో సన్‌రైజర్స్ విజయానికి దూరంగా నిలిచిపోయింది. ఈ ఓటమితో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి.
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగుల స్కోరును నమోదు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 76), జోస్ బట్లర్ (37 బంతుల్లో 64) అద్భుత అర్ధ శతకాలతో సన్‌రైజర్స్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నారు. సాయి సుదర్శన్ (48) కూడా రాణించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనద్కత్ (3/35) మాత్రమే కాస్త ప్రభావం చూపాడు.
భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ (20) వికెట్‌ను కోల్పోయింది. అయితే, క్రీజులో నిలిచిన అభిషేక్ శర్మ (41 బంతుల్లో 74; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ఏమాత్రం బెదరకుండా గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. చూడచక్కని సిక్సర్లతో అలరించాడు. కానీ, మరో ఎండ్ నుంచి ఇషాన్ కిషన్ (13), హెన్రిచ్ క్లాసెన్ (23) వంటి కీలక బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో అభిషేక్‌పై ఒత్తిడి పెరిగింది. కీలక సమయంలో అతను కూడా ఔట్ కావడంతో సన్‌రైజర్స్ ఓటమి ఖాయమైంది.
చివర్లో నితీష్ కుమార్ రెడ్డి (21*), పాట్ కమిన్స్ (19*) ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. గుజరాత్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ (2/19), మహమ్మద్ సిరాజ్ (2/38) రెండేసి వికెట్లతో ఆకట్టుకుని తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇషాంత్ శర్మ 1, కోట్జీ 1 వికెట్ తీశారు.
