Gaurav Gogoi: ఆ కాంగ్రెస్ ఎంపీ పిల్లలకు భారత పౌరసత్వం లేదు.. 15 రోజులు పాకిస్థాన్ ఎందుకు వెళ్లారు?: అసోం ముఖ్యమంత్రి

- కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్‌పై హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆరోపణలు
- గొగోయ్ పాక్ పర్యటనపై అనుమానాలున్నాయని వ్యాఖ్య
- గోగోయ్ భార్య పాక్ సంస్థ నుంచి జీతం తీసుకుంటున్నారని ఇటీవల హిమంత ఆరోపణ
- ఆరోపణలు నిరూపించకుంటే రాజీనామా చేస్తారా అని హిమంతకు గోగోయ్ సవాల్
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ మధ్య రాజకీయ వివాదం ముదురుతోంది. గౌరవ్ గోగోయ్ పిల్లలు భారత పౌరులు కాదని హిమంత శుక్రవారం ఆరోపించారు. గోగోయ్ పాకిస్థాన్‌కు 15 రోజుల పాటు ఎందుకు వెళ్లారని, అక్కడ ఏం చేశారని ప్రశ్నించారు. పాకిస్థాన్‌లో పర్యాటక ప్రాంతాలేవీ లేవని, అది ఉగ్రవాదుల అడ్డా అని వ్యాఖ్యానించారు. గోగోయ్ అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, మరిన్ని వివరాలు వెల్లడిస్తానని హిమంత తెలిపారు.
కొన్ని రోజుల క్రితం కూడా హిమంత, గోగోయ్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించారు. పాకిస్థాన్ పర్యటన వివరాలు, పాక్‌కు చెందిన ఎన్జీఓ నుంచి ఆయన భార్య జీతం తీసుకుంటున్నారనే ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలపై గౌరవ్ గోగోయ్ స్పందించారు. తనపై, తన భార్యపై చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని హిమంతకు సవాలు విసిరారు. తన కుటుంబ సభ్యులెవరూ పాకిస్థాన్ వెళ్లలేదని, పాక్ సంస్థల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం పొందలేదని స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులంతా భారత పౌరులేనని తేల్చిచెప్పారు.
ఇదిలా ఉండగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని, అవసరమైతే కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించినట్లు తెలిపారు. దేశంలో ఉంటూ పాక్‌కు మద్దతివ్వడం క్షమించరాని నేరమని ఆయన పేర్కొన్నారు.
అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. "అవసరమైతే వారి కాళ్లు విరగ్గొట్టండి. నిర్దాక్షిణ్యంగా వారి కాళ్లు విరగ్గొట్టి, అరెస్ట్ చేసి జైల్లో వేయాలని పోలీసులకు సూచిస్తున్నా" అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి అమాయకులను పొట్టన పెట్టుకుంటుంటే, ఇక్కడ కొందరు పాకిస్థాన్‌కు మద్దతు తెలపడం సహించరానిదని అన్నారు.
ఇప్పటికే తమ రాష్ట్రంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన పలువురిని అరెస్టు చేసి, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని హిమంత బిశ్వ శర్మ గుర్తు చేశారు. "మన దేశంలో నివసిస్తూ, ఇక్కడి తిండి తింటూ పాకిస్థాన్‌కు మద్దతు తెలిపే వారు మాకు అవసరం లేదు. అలాంటి వారిని దేశం, రాష్ట్రం ఎప్పటికీ క్షమించదు, సహించదు" అని ఆయన హెచ్చరించారు.
పహల్గామ్ దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా బాధలో ఉన్నారని, ఈ క్లిష్ట సమయంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, భారత సైన్యానికి మద్దతుగా నిలవాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ మూలన ఉగ్రవాదులు దాక్కున్నా, వారిని వేటాడి అంతమొందించే శక్తిని మన సైన్యానికి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించాలని ప్రజలను కోరారు.