Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ పరుగుల పండుగ... సన్ రైజర్స్ ముందు భారీ టార్గెట్

- అహ్మదాబాద్ లో సన్ రైజర్స్ × గుజరాత్ టైటాన్స్
- గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 224/6
- కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (76), జోస్ బట్లర్ (64) అర్ధశతకాలతో విజృంభణ
- సాయి సుదర్శన్ 23 బంతుల్లో వేగంగా 48 పరుగులు
గుజరాత్ టైటాన్స్ తో పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. సొంతగడ్డపై టాప్ ఆర్డర్ బ్యాటర్ల మెరుపులతో గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ అర్ధశతకాలతో కదం తొక్కగా, సాయి సుదర్శన్ ఆరంభంలో వేగంగా పరుగులు సాధించి జట్టు భారీ స్కోరుకు బలమైన పునాది వేశాడు.
ఆరంభం నుంచే గుజరాత్ బ్యాటర్లు దూకుడు ప్రదర్శించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ కేవలం 23 బంతుల్లోనే 9 ఫోర్ల సహాయంతో 48 పరుగులు చేసి జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో కీపర్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి సుదర్శన్ పెవిలియన్ చేరాడు. మరో ఎండ్ లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా విజృంభించి ఆడాడు. గిల్ కేవలం 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు సాధించి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. కీలక సమయంలో హర్షల్ పటేల్, క్లాసెన్ సమన్వయంతో చేసిన ఫీల్డింగ్ విన్యాసానికి గిల్ రనౌట్ గా వెనుదిరిగాడు.
జోస్ బట్లర్ కూడా తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. 37 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసి జట్టు స్కోరు 200 పరుగులు దాటడంలో కీలక పాత్ర పోషించాడు. పాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి బట్లర్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ (16 బంతుల్లో 21), చివర్లో షారుఖ్ ఖాన్ (2 బంతుల్లో 6 నాటౌట్), రాహుల్ తెవాటియా (3 బంతుల్లో 6) తలా కొన్ని పరుగులు చేశారు.
ప్రత్యర్థి బౌలర్లలో జయదేవ్ ఉనాద్కట్ ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసి 35 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఉనద్కట్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో సుందర్, తెవాటియా, రషీద్ ఖాన్ (0) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ పాట్ కమ్మిన్స్, జీషన్ అన్సారీ తలో వికెట్ తీశారు. అయితే, మహమ్మద్ షమీ (3 ఓవర్లలో 48 పరుగులు), హర్షల్ పటేల్ (3 ఓవర్లలో 41 పరుగులు) ధారాళంగా పరుగులిచ్చారు.