Mustakim Bhatiyara: భారతీయుడ్ని ఉరితీసిన కువైట్ అధికారులు

Indian Man Executed in Kuwait
  • కువైట్‌లో భారతీయ వంటమనిషికి మరణశిక్ష అమలు
  • యజమాని హత్య కేసులో దోషిగా నిర్ధారణ
  • గుజరాత్‌కు చెందిన 38 ఏళ్ల ముస్తకీం భాతియారా
  • ఏప్రిల్ 28న ఉరిశిక్ష అమలు, బుధవారం స్వస్థలంలో ఖననం
  • గత ఏడేళ్లుగా కువైట్‌లో పనిచేస్తున్న బాధితుడు
యజమాని హత్య కేసులో దోషిగా తేలిన భారతీయ వంటమనిషికి కువైట్‌లో మరణశిక్ష విధించారు. గుజరాత్‌లోని కపడ్‌వంజ్‌కు చెందిన 38 ఏళ్ల ముస్తకీం భాతియారాకు ఏప్రిల్ 28న ఈ శిక్షను అమలు చేసినట్లు తెలిసింది. అనంతరం అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించి, బుధవారం స్వస్థలంలో ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారు.

లభించిన సమాచారం ప్రకారం, ముస్తకీం సుమారు ఏడేళ్లుగా కువైట్‌లో రెహానా ఖాన్ అనే మహిళ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్నాడు. 2019లో యజమాని రెహానా ఖాన్‌తో ముస్తకీంకు వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి, తీవ్ర ఘర్షణకు దారితీయడంతో ముస్తకీం ఆమెను కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తర్వాత యజమాని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కువైట్ పోలీసులు ముస్తకీంను అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం 2021లో న్యాయస్థానం అతన్ని దోషిగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది.

గుజరాత్‌లోని కపడ్‌వంజ్‌లోని మొహమ్మదాలీ చౌక్ నివాసి అయిన ముస్తకీం, గత దశాబ్ద కాలానికి పైగా గల్ఫ్ దేశాల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. మొదట దుబాయ్‌లో, తర్వాత బహ్రెయిన్‌లో పనిచేసిన అతను, గత ఏడేళ్లుగా కువైట్‌లో ఉంటున్నాడు. రాజస్థాన్‌లోని బన్స్వారాకు చెందిన ఓ జంట అతనికి కువైట్‌లో రెహానా ఖాన్, ముస్తుఫా ఖాన్ ఇంట్లో ఉద్యోగం ఇప్పించినట్లు సమాచారం.

ఈ ఏడాది ఏప్రిల్ 28న ముస్తకీంకు మరణశిక్షను అమలు చేశారు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయ అధికారులు కపడ్‌వంజ్‌లోని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం మృతదేహాన్ని అహ్మదాబాద్‌కు తరలించారు. అక్కడి నుంచి స్వస్థలమైన కపడ్‌వంజ్‌కు తీసుకెళ్లి, బుధవారం ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
Mustakim Bhatiyara
Kuwait
Death Penalty
Indian Cook
Murder Case
Rehana Khan
Kapadvanj
Gujarat
Gulf Countries
Death Sentence

More Telugu News