Gulshana Riyaz Khan: గుజరాత్ లో కాజల్, హర్యానాలో సీమా, యూపీలో స్వీటీ... ఈమె నేషనల్ లెవల్ నిత్య పెళ్లికూతురు!

- డాకు దుల్హన్' గుల్షానా అరెస్ట్!
- 21 ఏళ్ల వయసుకే 12 పెళ్లిళ్లు
- పెళ్లి పేరుతో గుజరాత్, హర్యానా, బీహార్, యూపీలలో వరుల కుటుంబాలకు టోకరా
- వివాహం తర్వాత నకిలీ కిడ్నాప్ డ్రామాతో నగలు, డబ్బుతో వధువు ఉడాయింపు
పెళ్లి పేరుతో వరుల కుటుంబాలను నిలువునా ముంచుతున్న ఓ ఘరానా మోసగత్తె, ఆమె ముఠా గుట్టును ఉత్తరప్రదేశ్ పోలీసులు రట్టు చేశారు. పలు రాష్ట్రాల్లో ‘డాకు దుల్హన్’ (దోపిడీ వధువు) గా పేరుమోసిన గుల్షానా రియాజ్ ఖాన్ (21) సహా 9 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే నకిలీ కిడ్నాప్ డ్రామాతో వధువు, విలువైన వస్తువులు, డబ్బు మాయమయ్యేలా వీరు పక్కా పథకం పన్నేవారు.
పలు రాష్ట్రాల్లో... పన్నెండుకు పైగా మోసాలు
గుజరాత్‌లో కాజల్, హర్యానాలో సీమా, బీహార్‌లో నేహా, ఉత్తరప్రదేశ్‌లో స్వీటీ... ఇలా వివిధ పేర్లతో చెలామణి అయిన గుల్షానా, ఇప్పటివరకు కనీసం 12 పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వివాహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్న, సులభంగా మోసపోయే కుటుంబాలనే ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంది. అంబేడ్కర్ నగర్ జిల్లా పరిధిలోని బస్కరీ పోలీస్ స్టేషన్ పరిధి కసదహా గ్రామ సమీపంలో గురువారం వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో గుల్షానాతో పాటు మరో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.
మోసం చేసే తీరు ఇదీ...
ఎస్పీ కేశవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముఠా మ్యాట్రిమోనియల్ సైట్లు, సోషల్ మీడియా ద్వారా సంబంధాలు కుదుర్చుకుంటుంది. గుల్షానాను వధువుగా పరిచయం చేసి, వరుడి కుటుంబం నమ్మకాన్ని పూర్తిగా చూరగొంటారు. అనంతరం, పెళ్లి ఖరారు చేసుకున్నందుకు వరుడి కుటుంబం నుంచి కొంత మొత్తాన్ని 'సెటిల్‌మెంట్' పేరుతో వసూలు చేస్తారు. ఘనంగా పెళ్లి వేడుక జరిపిస్తారు.
ఆ తంతు ముగిసిన కొద్ది గంటల్లోనే, ముఠా సభ్యులు మోటార్‌సైకిళ్లపై వచ్చి వధువును కిడ్నాప్ చేసినట్లు నాటకమాడతారు. "వరుడి కుటుంబం తేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసే లోపే, వధువుతో సహా ముఠా సభ్యులంతా వేరే పేర్లతో, వేరే ప్రాంతానికి మకాం మార్చేవారు" అని ఎస్పీ వివరించారు. విచారణలో గుల్షానాకు జౌన్‌పూర్‌కు చెందిన రియాజ్ ఖాన్ అనే వ్యక్తితో చట్టబద్ధంగా వివాహమైందని, ఆమె మోసాల గురించి అతనికి తెలుసని, ప్రతీ మోసంలో 5% వాటా తీసుకునేవాడని కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
బాధితుడి అప్రమత్తతతో బట్టబయలు
హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన సోను అనే యువకుడిని ఈ ముఠా ఇటీవల రూ. 80,000కు మోసం చేయడంతో వీరి బండారం బయటపడింది. పెళ్లయిన కొద్ది గంటలకే తన నవ వధువు అదృశ్యం కావడంతో అనుమానం వచ్చిన సోను, వెంటనే యూపీ పోలీసుల అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న అంబేడ్కర్ నగర్ పోలీసులు తక్షణమే స్పందించి, జిల్లా నుంచి బయటకు వెళ్లే మార్గాలను మూసివేశారు. ఈ క్రమంలో ముఠా సభ్యుల్లో ఒకరు పోలీసులకు చిక్కాడు. అతనిచ్చిన సమాచారంతో మిగిలిన ఎనిమిది మందిని వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిలో హర్యానా జింద్‌కు చెందిన మోహన్‌లాల్ (34), జౌన్‌పూర్‌కు చెందిన రతన్ కుమార్ సరోజ్ (32), రంజన్ అలియాస్ అశు గౌతమ్ (22), మంజు మాలి (29), అంబేడ్కర్ నగర్‌కు చెందిన రాహుల్ రాజ్ (30), సన్నో అలియాస్ సునీత (36), పూనమ్ (33), రుఖ్సార్ (21) ఉన్నారు. వీరి నుంచి రూ. 72,000 నగదు, ఒక మోటార్‌సైకిల్, 11 మొబైల్ ఫోన్లు, ఒక బంగారు మంగళసూత్రం, మూడు నకిలీ ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పక్కా ప్రణాళికతో పని విభజన
ఈ ముఠా సభ్యులు పక్కా ప్రణాళికతో పనులు విభజించుకున్నారని విచారణలో తేలింది. గుల్షానా నేతృత్వంలోని మహిళలు నమ్మకం కలిగించడం, నకిలీ పత్రాలు సృష్టించడం, కుటుంబాలను ఒప్పించడం వంటివి చేయగా, పురుషులు పెళ్లి తర్వాత వధువును సురక్షితంగా తప్పించే బాధ్యత తీసుకునేవారు. ఈ ముఠాపై మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర కింద భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కేశవ్ కుమార్ తెలిపారు.