Shehbaz Sharif: పాకిస్థాన్ ప్రధానికి భారత్ ఝలక్... యూట్యూబ్ ఛానల్ నిలిపివేత!

- భారత్‌లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారిక యూట్యూబ్ ఛానల్‌పై నిషేధం
- జాతీయ భద్రత, శాంతిభద్రతల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు
- పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం
- గతంలో 16 పాక్ ఛానళ్లపై నిషేధం
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధికారిక యూట్యూబ్ ఛానల్‌ను భారత్‌లో నిలిపివేసింది. ప్రస్తుతం ఈ ఛానల్‌ను భారత్‌లో చూడటానికి ప్రయత్నిస్తే, "జాతీయ భద్రత లేదా శాంతిభద్రతలకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కారణంగా ఈ కంటెంట్ మీ దేశంలో అందుబాటులో లేదు" అనే సందేశం కనిపిస్తోంది.
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన కొద్ది రోజులకే ఈ చర్య తీసుకోవడం గమనార్హం. అంతకుముందు కూడా రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్‌ను, భారత్‌కు, భారత భద్రతా దళాలకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్న ఆరోపణలపై 16 ప్రముఖ పాకిస్థానీ యూట్యూబ్ ఛానళ్లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. వీటిలో డాన్, సమా టీవీ, ఏఆర్‌వై న్యూస్, జియో న్యూస్, బోల్ న్యూస్ వంటి ప్రధాన వార్తా సంస్థల ఛానళ్లు కూడా ఉన్నాయి.
పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి 'ఎక్స్' ఖాతాను భారత్ బ్లాక్ చేసింది. పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు షోయబ్ అక్తర్, బాసిత్ అలీ, షాహిద్ అఫ్రిదిలకు చెందిన ఛానళ్లపై కూడా చర్యలు తీసుకుంది. పాకిస్థాన్ క్రికెటర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షహీన్ అఫ్రిది ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సస్పెండ్ అయ్యాయి. పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఇదివరకే బ్లాక్ చేసింది.