గంగా ఎక్స్‌ప్రెస్ వేపై వాయుసేన యుద్ధ విమానాల ట్రయల్స్

Indian Air Force Conducts Fighter Jet Trials on Ganga Expressway
  • యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్, టేకాఫ్ సామర్థ్య పరీక్ష
  • షాజహాన్‌పుర్‌ వద్ద 3.5 కి.మీ. ఎయిర్‌ స్ట్రిప్‌పై విన్యాసాలు
  • పగలు, రాత్రి వేళల్లోనూ కొనసాగుతున్న ట్రయల్స్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) శుక్రవారం ప్రత్యేక విన్యాసాలు చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌లకు ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఎంతవరకు అనుకూలంగా ఉందో పరీక్షించేందుకు ఈ కసరత్తు నిర్వహిస్తున్నారు. షాజహాన్‌పుర్‌ సమీపంలో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రత్యేకంగా నిర్మించిన సుమారు 3.5 కిలోమీటర్ల ఎయిర్‌ స్ట్రిప్‌ వేదికగా ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి.

యుద్ధ సమయాల్లో లేదా ఇతర అత్యవసర సమయాల్లో వైమానిక స్థావరాలు అందుబాటులో లేనప్పుడు, ఎక్స్‌ప్రెస్‌వేలను ప్రత్యామ్నాయ రన్‌వేలుగా ఉపయోగించుకునే సామర్థ్యాన్ని అంచనా వేయడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా, ఉదయం సాధారణ సమయాల్లోనూ, రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్యలోనూ యుద్ధ విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌లను ఐఏఎఫ్ సిబ్బంది పరీక్షిస్తున్నారు.

ఈ విన్యాసాల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎయిర్‌ స్ట్రిప్ ప్రాంతంలో సుమారు 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. గురువారం నుంచే ఈ మార్గాన్ని పూర్తిగా వైమానిక దళం తమ ఆధీనంలోకి తీసుకుంది. రఫెల్, సుకోయ్-30ఎంకేఐ, మిరాజ్-2000, మిగ్-29, జాగ్వార్, సీ-130జే సూపర్ హెర్క్యులస్, ఏఎన్-32 ట్రాన్సుపోర్టు ఎయిర్ క్రాఫ్ట్, ఎంఐ-17 వీ5 హెలికాప్టర్లతో విన్యాసాలు చేపట్టింది.

కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్‌ల కోసం ఎయిర్‌ స్ట్రిప్ సౌకర్యంతో నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేలలో ఇది నాలుగోది. గతంలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేలపై కూడా ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయి. ఈ పరీక్షల ద్వారా ఎక్స్‌ప్రెస్ వేల బహుళ ప్రయోజన సామర్థ్యాన్ని, దేశ రక్షణ సంసిద్ధతను ఐఏఎఫ్ బలోపేతం చేసుకుంటోంది.
Advertisement
Indian Air Force
IAF
Ganga Expressway
Uttar Pradesh
Emergency Landing
Fighter Jets
Airstrip
Military Exercise
Rafale
Sukhoi-30MKI

More Telugu News