TSRTC: హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు.. అలా ఇక డీలక్స్‌లో తిరగొచ్చు

Hyderabad RTC Offers Deluxe Travel for Rs20 Extra
  • హైదరాబాద్‌లో జనరల్, మెట్రో బస్ పాస్ దారులకు టీజీఎస్ఆర్టీసీ కొత్త సౌకర్యం
  • రూ. 20 అదనపు చెల్లింపుతో 'మెట్రో కాంబో టికెట్' అవకాశం
  • ఈ టికెట్‌తో మెట్రో డీలక్స్ బస్సు సర్వీసుల్లో ప్రయాణించే వెసులుబాటు
  • నగర ప్రయాణికుల సౌకర్యార్థం నిర్ణయం తీసుకున్నామన్న టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సాధారణ పాస్ హోల్డర్లకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) శుభవార్తను అందించింది. ఇకపై వారు అదనంగా రూ. 20 చెల్లించి మెట్రో డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

నగర ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిని 'మెట్రో కాంబో టికెట్' పేరుతో పరిచయం చేశారు. జనరల్ బస్‌పాస్‌తో పాటు మెట్రో బస్‌పాస్ కలిగిన ప్రయాణికులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

కేవలం 20 రూపాయల అదనపు రుసుము చెల్లించి ఈ కాంబో టికెట్‌ను పొందితే, ఆ రోజు నగరంలోని అన్ని మెట్రో డీలక్స్ బస్సు సర్వీసులలో ప్రయాణించవచ్చు. ఈ నూతన విధానం వివరాలను టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.

హైదరాబాద్‌లోని అన్ని మెట్రో డీలక్స్ బస్సు సర్వీసులకు ఈ 'మెట్రో కాంబో టికెట్' వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ మార్గాలను అందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
TSRTC
Hyderabad RTC
Metro Deluxe Buses
Combo Ticket
Bus Pass
V.C. Sajjanar
Hyderabad Local Transport
Affordable Travel
Public Transport Hyderabad
Metro Combo Ticket

More Telugu News