Narendra Modi: ప్రధానమంత్రి పక్కన శశిథరూర్.. నరేంద్రమోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

Modis Interesting Remarks with Tharoor by his side
  • కేరళలో రూ.8,900 కోట్ల విఝింజం పోర్ట్ ప్రారంభించిన ప్రధాని మోదీ
  • కార్యక్రమానికి హాజరైన స్థానిక కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
  • కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు
  • ఈ కార్యక్రమం చూసి కొంతమందికి నిద్రపట్టదని వ్యాఖ్య
"ఈరోజు శశిథరూర్ ఇక్కడే నా పక్కన ఉన్నారు. ఈ కార్యక్రమం కొంతమందికి నిద్ర లేని రాత్రిని మిగులుస్తుంది. ఈ సందేశం ఎక్కడకు వెళ్లాలో అక్కడకు వెళ్లిపోయింది" అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత, స్థానిక ఎంపీ శశిథరూర్‌తో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరువనంతపురం సమీపంలోని విఝింజమ్ అంతర్జాతీయ ఓడరేవు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ, అదే వేదికపై ఉన్న తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ను ప్రస్తావిస్తూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు.

కాగా, గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధాని మోదీకి శశిథరూర్ వ్యక్తిగతంగా స్వాగతం పలికారు. విమానాల ఆలస్యం కారణంగా చివరి నిమిషంలో తిరువనంతపురం చేరుకున్నప్పటికీ, తన నియోజకవర్గానికి వచ్చిన ప్రధానికి స్వాగతం పలికానని శశిథరూర్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.

గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యంగా అధినాయకత్వంతో శశిథరూర్‌కు సత్సంబంధాలు లేవనే ప్రచారం జరుగుతోంది. పలు సందర్భాల్లో ఆయన పార్టీ విధానాలకు భిన్నంగా, అలాగే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధిస్తూ మాట్లాడటం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఈ క్రమంలో ప్రధాని పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో థరూర్ పాలుపంచుకోవడం, దీనిపై మోదీ ప్రత్యేకంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Narendra Modi
Shashi Tharoor
Kerala
Congress Party
BJP
Indian Politics
Thiruvananthapuram
Vizhinjam Port
Modi Tharoor
Political Event

More Telugu News