Vaibhav Suryavanshi: ఎదుర్కొన్న రెండో బంతికే సూర్యవంశీ అవుట్.. గవాస్కర్ అన్నట్టే జరిగిందిగా!

- ముంబైతో మ్యాచ్‌లో సూర్యవంశీ డకౌట్
- అతడిపై అతి పొగడ్తలు వద్దని గవాస్కర్ సూచన
- బౌలర్లు పన్నే వ్యూహంలో చిక్కుకోవచ్చని అభిప్రాయం
- గవాస్కర్ చెప్పినట్టుగానే ఆడిన రెండో బంతికే డకౌట్
గుజరాత్ టైటాన్స్‌పై ఇటీవల అద్భుత శతకంతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వైభవ్‌ను ఇప్పుడే అతిగా పొగడవద్దని, అతడు నేర్చుకోవాల్సి చాలా ఉందని పేర్కొన్నాడు.
ముంబై, రాజస్థాన్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరుగుతుండగా కామెంటరీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్.. వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘వైభవ్ వేలానికి ముందే యూత్ టెస్టులో ఆస్ట్రేలియాపై శతకం సాధించాడు. 13 ఏళ్ల వయసులో అంతర్జాతీయ జట్టుపై సెంచరీ చేయడం చిన్న విషయం కాదు. అతడిలో ప్రతిభ ఉంది, కానీ ఇంకా పూర్తిగా రాటుదేలలేదు. తన ఆటను మరింత మెరుగుపరుచుకోవాలి. ద్రవిడ్ వంటి వారి మార్గదర్శకత్వంలో అతడు మరింత అభివృద్ధి చెందుతాడు’ అని గవాస్కర్ పేర్కొన్నాడు.
అదే సమయంలో సూర్యవంశీపై అప్పుడే ప్రశంసలు సరికాదని గవాస్కర్ హెచ్చరించాడు. ‘తొలి మ్యాచ్‌లో మొదటి బంతికే సిక్స్, మూడో మ్యాచ్‌లో సెంచరీ చూసి అనుభవజ్ఞులైన బౌలర్లు అతడిని తేలికగా అంచనా వేయరు. ‘మొదటి బంతికే సిక్స్ కొడతాడేమో’ అని భావించి షార్ట్ లెంగ్త్ బంతులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల వైభవ్ ఔటయ్యే ప్రమాదం ఉంది. అలా జరిగితే అతను ఒత్తిడికి లోనై, అతిగా ఆలోచించే అవకాశం ఉంది’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
గవాస్కర్ అన్నట్టుగానే..
ముంబైతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ దారుణంగా విఫలమయ్యాడు. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, బంతిని సరిగ్గా అంచనా వేయలేక మిడాన్‌లో ఉన్న ఫీల్డర్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే వైభవ్ నిష్క్రమించడం రాజస్థాన్ జట్టును ఆరంభంలోనే దెబ్బతీసింది. దీంతో గవాస్కర్ చెప్పిందే ఇప్పుడు జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
రోహిత్ శర్మ ప్రోత్సాహం
వైభవ్ సూర్యవంశీ నిరాశగా పెవిలియన్ వైపు నడుస్తుండగా ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అతడి వద్దకు వచ్చాడు. యువ ఆటగాడి భుజం తట్టి ‘ఏమీ కాదు, ఇలాంటివి జరుగుతుంటాయి, నువ్వు ఇంకా నేర్చుకుంటావు’ అంటూ ప్రోత్సహించాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కామెంటరీలో రవిశాస్త్రి కూడా రోహిత్ చూపిన క్రీడాస్ఫూర్తిని ప్రస్తావించాడు. రోహిత్ శర్మపై నెటిజన్లు, క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక యువ ఆటగాడు విఫలమైనప్పుడు సీనియర్ ఆటగాడు అండగా నిలవడం మంచి సంప్రదాయమని కొనియాడుతున్నారు.