Rohit Sharma: వాటి కోసం నేను ఎప్పుడూ ఆడలేదు.. జట్టు ప్రయోజనాలే ముఖ్యం: రోహిత్ శర్మ

- వ్యక్తిగత రికార్డుల కోసం తానేప్పుడూ పాకులాడలేదన్న హిట్‌మ్యాన్
- భారీ స్కోర్ చేసినా.. ఆ రన్స్ జట్టు విజయానికి ఉపయోగపడాలన్న రోహిత్
- ట్రోఫీ గెలవనప్పుడు మనం వ్యక్తిగతంగా ఎన్ని పరుగులు చేసిన ప్రయోజనం ఉండదన్న బ్యాటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆటతీరు, ప్రాధాన్యతల గురించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత రికార్డుల కన్నా తనకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమన్నారు. తానేప్పుడూ వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడలేదన్నాడు. తాను చేసే పరుగులు జట్టు విజయానికి ఉపయోగపడకపోతే... ఎన్ని రన్స్ చేసినా ఏం లాభమని హిట్‌మ్యాన్ అభిప్రాయపడ్డాడు. తాను వ్యక్తిగతంగా పెద్ద స్కోర్లు చేసినప్పుడు జట్టు కూడా విజయం సాధిస్తే... ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిదని పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా 2019 వన్డే ప్రపంచకప్ ఉదంతాన్ని రోహిత్ గుర్తు చేశాడు. తాను ఈ ఐసీసీ టోర్నీలో వరుస సెంచరీలు బాదినప్పటికీ టీమిండియా సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమితో ఇంటిముఖం పట్టిందని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ వన్డే వరల్డ్‌కప్‌లో హిట్‌మ్యాన్ ఏకంగా 5 శతకాలు బాదిన విషయం తెలిసిందే. మొత్తంగా తొమ్మిది మ్యాచుల్లో 648 రన్స్ చేశాడు. ఓ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఇప్పటివరకు రోహిత్ తప్ప ఇంకెవ్వరూ ఇన్ని సెంచరీలు చేయకపోవడం గమనార్హం.
"టోర్నీలో విజేతగా నిలిచి ట్రోఫీ గెలవనప్పుడు మనం వ్యక్తిగతంగా 600, 700, 800 ఇలా ఎన్ని రన్స్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ విషయం నాకు 2019 వన్డే ప్రపంచకప్‌లో బాగా బోధపడింది. భారీ స్కోర్లు చేయడం నా వరకు బాగానే ఉంటుంది. కానీ, ఆ పరుగులు జట్టు విజయానికి తోడ్పడకుంటే ప్రయోజనం ఉండదు. అలాగని నేను చేసే 20, 30 పరుగులు జట్టు విజయానికి ఉపయోగపడతాయని చెప్పడం లేదు. ప్రతిసారి జట్టు గెలుపులో నా వంతు పాత్ర ఉండాలనే నేను ఆలోచిస్తాను" అని ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ హిట్‌మ్యాన్ అన్నాడు.