Ajmer Hotel Fire: హోటల్లో అగ్ని ప్రమాదం.. బిడ్డను కిందకు విసిరేసిన తల్లి

- రాజస్థాన్ అజ్మీర్‌లోని నాజ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం
- ఘటనలో నలుగురు మృతి, పలువురికి గాయాలు
- మూడో అంతస్తు నుంచి బిడ్డను కిందకు విసిరి కాపాడిన తల్లి
- కిందకు దూకే క్రమంలో తల్లి చిక్కుకుపోయిన వైనం
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని నాజ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించి, లోపల ఉన్నవారు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని కొందరు చెబుతుండగా, హోటల్‌లోని ఏసీ పేలడమే ప్రమాదానికి కారణమని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడో అంతస్తులో మంటలు, పొగలో చిక్కుకున్న ఒక తల్లి తన బిడ్డను కాపాడుకునేందుకు సాహసం చేసింది. తన చిన్నారిని కిందకు విసిరేయగా, అప్రమత్తంగా ఉన్న స్థానికులు ఆ బిడ్డను సురక్షితంగా పట్టుకున్నారు. ఈ ఘటనలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఆ తరువాత, ఆ తల్లి కూడా కిందకు దూకేందుకు ప్రయత్నించినప్పటికీ, ప్రతికూల పరిస్థితుల్లో కారణంగా అక్కడే చిక్కుకుపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.