Ishwari: బంగారం కోసం కన్నతల్లిని అడవిలో వదిలేసిన కసాయి కూతురు.. జగిత్యాల జిల్లాలో దారుణం

Daughter abandons mother in forest for gold

  • తల్లిని అడవిలోకి తీసుకెళ్లి నగలు లాక్కుని వెళ్లిపోయిన వైనం
  • రెండు రోజుల పాటు అడవిలో వృద్ధురాలు అగచాట్లు
  • స్థానికుల సమాచారంతో వృద్ధురాలిని రక్షించిన అధికారులు

కన్నతల్లి ఒంటి మీద ఉన్న బంగారం కోసం ఓ కూతురు అమానవీయంగా ప్రవర్తించింది. తనకు జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తల్లిని నిర్దయగా అడవిలో వదిలేసింది. వృద్ధురాలనే కనికరం కూడా లేకుండా నగలు లాక్కుని వెళ్లిపోయింది. ఎక్కడున్నానో, ఎటు వెళ్లాలో తెలియక రెండు రోజుల పాటు ఆ వృద్ధురాలు అడవిలో తిరుగుతూ చివరకు సొమ్మసిల్లి పడిపోయింది. జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుందీ దారుణ సంఘటన.

శ్రీరాములపల్లె గ్రామస్థులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపూర్ వీధిలో బుధవ్వ అనే వృద్ధురాలు తన కూతురు ఈశ్వరితో కలిసి ఉంటోంది. తల్లి బుధవ్వ ఒంటిపై ఉన్న నగలను చేజిక్కించుకోవడం కోసం ఈశ్వరి దారుణమైన చర్యకు పాల్పడింది. రెండు రోజుల క్రితం బుధవ్వను గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె శివార్లలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. ఆపై బుధవ్వ ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని తల్లిని వదిలేసి వెళ్లిపోయింది.

ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిన కూతురు ఎంతకూ రాకపోవడంతో బుధవ్వ కంగారు పడింది. తాను ఎక్కడున్నానో, ఎటు వెళ్లాలో తెలియక ఆందోళనతో అటూఇటూ తిరిగింది. రెండు రోజుల పాటు తిండి లేక, తాగడానికి నీరు లేక అడవిలోనే ఉండిపోయింది. చివరకు నీరసించి ఒక చోట సొమ్మసిల్లి పడిపోయింది. అటుగా వెళ్లిన యువకులు బుధవ్వను గమనించి ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న జిల్లా అధికారులు బుధవ్వను ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సతో కోలుకున్న బుధవ్వ తన కూతురు చేసిన పనిని అధికారులకు వివరించింది. ఈ దారుణం తెలుసుకున్న గ్రామస్థులు.. బుధవ్వ కూతురు ఈశ్వరికి తగిన బుద్ధిచెప్పాలని కోరుతున్నారు.

Ishwari
Budhavva
Jagtial District
Gold Robbery
Elderly Woman Abandoned
Cruel Daughter
Telangana Crime
Forest Incident
Sriramulapalle
Gollappalli Mandal
  • Loading...

More Telugu News