Hafiz Saeed: భారత సైన్యానికి జడిసి ఉగ్రవాదికి పాక్ కమాండోల రక్షణ

Pakistani Commandos Guarding Hafiz Saeed Despite Indias Concerns
  • కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను కాపాడుకుంటున్న దాయాది దేశం
  • పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ దాడి చేస్తుందన్న భయం
  • లాహోర్‌లోని నివాసాన్నే తాత్కాలిక సబ్ జైలుగా మార్పు
  • అధికారికంగా హఫీజ్ కు జైలు.. స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు కథనాలు
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టవచ్చన్న భయంతో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అప్రమత్తమైంది. నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జమాత్ ఉద్ దవా (జేయూడీ) చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు భద్రతను భారీగా పెంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పహల్గాం దాడికి తామే బాధ్యులమని లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను కాపాడుకోవడం కోసం గతంలో స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్‌ఎస్‌జీ)లో పనిచేసిన కమాండోలను పాక్ ప్రభుత్వం నియమించింది. లాహోర్‌లోని మొహల్లా జోహార్‌తో సహా అతడి నివాసాల వద్ద అదనపు సిబ్బందిని మోహరించింది. సాధారణ పౌరుల ఇళ్లు, ఒక మసీదు, మదర్సాతో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే ఉద్దేశపూర్వకంగా సయీద్ నివాసం ఉండేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అతడి ఇంటిని తాత్కాలిక సబ్ జైలుగా మార్చి, చుట్టుపక్కల కిలోమీటరు పరిధిలోని కదలికలను పసిగట్టేందుకు గెశ్చర్ డిటెక్షన్ సీసీటీవీ కెమెరాలతో కూడిన కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం సహా పలు కేసుల్లో దోషిగా తేలిన హఫీజ్ సయీద్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడని పాకిస్థాన్ చెబుతోంది. అయితే, వాస్తవానికి అతడు సంప్రదాయ జైలులో ఉన్నది చాలా తక్కువని, పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత మూడేళ్లలో దాదాపు రెండు డజన్ల సార్లు బహిరంగంగా కనిపించినట్లు సమాచారం.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలతో పాటు మురిడ్కే, బహవల్‌పూర్, రావల్ కోట్‌లలో బహుళ అంచెల భద్రతా వలయం మధ్య సయీద్ తరచుగా కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 77 ఏళ్ల హఫీజ్ సయీద్‌ను 2008 ముంబై దాడులతో పాటు పహల్గాం ఘటనకు సంబంధించి భారత్‌తో పాటు అమెరికా కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి, అమెరికా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినప్పటికీ, పాకిస్థాన్ మాత్రం అతడికి కమాండోలతో రక్షణ కల్పించి మరీ కాపాడుకుంటోంది.
Hafiz Saeed
Pakistan
Terrorist
Commandos
India
ISI
Lashkar-e-Taiba
Mumbai Attacks
Pulwama Attack
Most Wanted Terrorist

More Telugu News