అన్నంత ప‌నిచేసిన భార‌త్‌.. పాక్‌కు గట్టి షాక్‌!

  • ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత భార‌త్‌, పాక్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు
  • దాయాది దేశంపై భార‌త్ క‌ఠిన ఆంక్ష‌లు
  • దాంతో ఇండియాపై ఆంక్ష‌ల‌కు దిగిన పాక్‌
  • త‌మ గ‌గ‌న‌త‌లంపై భార‌త‌ విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధం
  • దీటుగా స్పందించిన భార‌త్‌.. పాక్ విమానాల‌కు మ‌న గ‌గ‌న‌త‌లం మూసివేత‌
  • ఈ నిర్ణ‌యం ఏప్రిల్ 30 నుంచి మే 23 వ‌రకు అమ‌లు
ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో భార‌త్‌, పాక్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇరుదేశాలు పోటాపోటీగా ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ఈ క్ర‌మంలో దాయాది దేశం త‌మ గ‌గ‌న‌త‌లంలో భార‌త విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. దీంతో భార‌త్ కూడా దీటుగా స్పందించింది. పాక్ విమాన‌యాన సంస్థ‌ల‌కు భార‌త గ‌గ‌న‌త‌లాన్ని మూసివేసింది. ఇందుకు సంబంధించిన నోట‌మ్ (NOTAM) జారీ చేసింది. ఈ నిర్ణ‌యం ఏప్రిల్ 30 నుంచి మే 23 వ‌రకు అమ‌లులో ఉండ‌నుంది. 

ఇక‌, ఈ నిర్ణ‌యం పాక్ ఎయిర్‌లైన్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉందని నిపుణులు అంటున్నారు. పాకిస్థాన్ విమానాలు సింగ‌పూర్, థాయ్‌లాండ్‌, మ‌లేసియా త‌దిత‌ర దేశాల‌కు వెళ్లాలంటే మ‌న గ‌గ‌నత‌లాన్ని దాటాల్సిందే. ఇప్పుడు ఇండియా బ్యాన్ చేసింది క‌నుక‌ ద‌క్షిణాసియా ప్రాంతాల‌కు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాల‌ను మ‌ళ్లించాల్సి ఉంటుంది. అప్పుడు ప్ర‌యాణ స‌మ‌యం పెర‌గ‌డంతో పాటు నిర్వ‌హ‌ణ వ్య‌యం కూడా తడిసి మోపెడవుతోంది. 

ఇప్ప‌టికే ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న పాక్ విమానయాన సంస్థ‌ల‌కు ఇది మ‌రింత భారంగా మార‌నుంది. కాగా, భారత విమానాల‌పై త‌మ గ‌గ‌న‌త‌లంలో ప్ర‌వేశించ‌కుండా నిషేధం విధించిన పాక్ ఇప్ప‌టికే భారీగా న‌ష్ట‌పోతున్న విష‌యం తెలిసిందే. ఈ నిర్ణ‌యం వ‌ల్ల మ‌న‌కంటే కూడా దాయాది దేశానికే ఎక్కువ ఆర్థిక న‌ష్ట‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.


More Telugu News