CV Anand: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కీలక మార్పులు.. పలు పోలీస్ స్టేషన్ల పేరు మార్పు

Key Changes in Hyderabad Police Commissionerate Several Police Stations Renamed
  • హైదరాబాద్‌లో పలు పోలీస్ స్టేషన్ల పేర్లను మారుస్తూ నిర్ణయం
  • ప్రముఖ ప్రాంతాల గుర్తింపునకు అనుగుణంగా స్టేషన్ల పేర్లు
  • టోలిచౌకిలో 72వ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు
  • కమిషనరేట్ పరిధిలో 146 మంది సీఐలను బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాలనా సౌలభ్యం, ప్రజలకు సులువుగా అర్థమయ్యేందుకు వీలుగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పలు పోలీస్ స్టేషన్ల పేర్లను మార్చడంతో పాటు, కొత్తగా ఒక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో, కమిషనరేట్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను (సీఐలను) బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రముఖ ప్రాంతాల పేర్లతో పోలీస్ స్టేషన్లు

నగరంలోని ప్రఖ్యాత ప్రాంతాల పేర్లను ప్రతిబింబించేలా కొన్ని పోలీస్ స్టేషన్లు, డివిజన్ల పేర్లను మార్చినట్లు సీపీ సీవీ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం, ఇప్పటివరకు సచివాలయం పోలీస్ స్టేషన్‌గా ఉన్న పేరును 'లేక్ పోలీస్ స్టేషన్‌'గా మార్చారు. అదేవిధంగా, హుమాయున్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను 'మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌'గా, షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌ను 'గోషామహల్ పోలీస్ స్టేషన్‌'గా మారుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వీటితో పాటు, టోలిచౌకి ప్రాంతంలో 72వ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌ను కొత్తగా ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

35 ఏళ్ల తర్వాత పునర్వ్యవస్థీకరణ

సుమారు 35 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ కమిషనరేట్‌లో పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. ఇప్పటివరకు నగరంలో 71 లా అండ్ ఆర్డర్, 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని ఆయన వివరించారు. గత రెండేళ్లుగా పోలీస్ స్టేషన్ల హద్దుల విషయంలో కొన్ని సమస్యలు, లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ ఠాణాలపై ప్రజల్లో గందరగోళం నెలకొన్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించగా, మార్పులకు ఆమోదం లభించిందని తెలిపారు. పోలీస్ స్టేషన్ల పూర్తి వివరాలు, వాటి పరిధిని హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో అందుబాటులో ఉంచుతామని సీపీ స్పష్టం చేశారు.

146 మంది సీఐల బదిలీ

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ పరిపాలనా ప్రక్షాళన జరిగింది. మొత్తం 146 మంది సీఐలను బదిలీ చేస్తూ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న సీఐలు ఈ బదిలీల జాబితాలో ఉన్నారు. కమిషనరేట్ పరిధిలో పాలనను మరింత మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
CV Anand
Hyderabad Police Commissioner
Hyderabad Police
Police Station Renaming
Police Station Restructuring
Hyderabad Police Restructuring
Circle Inspectors Transfer
Telangana Police
Law and Order
Traffic Police

More Telugu News