Venkatesh: రజనీకాంత్ చెప్పిన మాటే నన్ను సక్సెస్ చేసిందనుకుంటా: వెంకటేశ్

Venkatesh Credits Rajinikanths Advice for His Success
  • మంచి కథలు ఎంచుకుని, మంచి సినిమాలు చేయమని రజనీ సూచించారన్న వెంకటేశ్
  • మంచి సినిమాలు చేయడంపైనే తన దృష్టి ఉంటుందని వెల్లడి
  • ఆధ్యాత్మిక భావనలకు అధిక ప్రాధాన్యత ఇస్తానన్న వెంకీ
విక్టరీ వెంకటేశ్ తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత అభిరుచులపై ఎప్పుడూ ఆసక్తికరంగా స్పందిస్తుంటారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, కుటుంబ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో, తన కెరీర్‌ను, ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసిన ఓ కీలక విషయాన్ని ఆయన పంచుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు ఇచ్చిన ఓ అమూల్యమైన సలహా గురించి వెంకటేశ్ వెల్లడించారు.

తాను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్ల నుంచి రజనీకాంత్‌తో తనకు మంచి అనుబంధం ఉందని వెంకటేశ్ గుర్తుచేసుకున్నారు. రజినీకాంత్ తన తండ్రి రామానాయుడుతో కూడా సినిమాలు చేశారని చెప్పారు. ఆ సమయంలో రజనీకాంత్ తనకు ఒక ముఖ్యమైన మాట చెప్పారని వెల్లడించారు.

"సినిమా విడుదల సమయంలో నీ పోస్టర్లు వేశారా, భారీ కటౌట్లు పెట్టారా అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. పోస్టర్‌లో నీ ముఖం సరిగ్గా కనిపిస్తుందా లేదా అని కూడా పట్టించుకోవాల్సిన పనిలేదు. నువ్వు చేయాల్సిందల్లా మంచి కథలు ఎంచుకుని, మంచి సినిమాలు చేయడం. అవే నిన్ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తాయి" అని రజనీకాంత్ హితవు పలికినట్లు వెంకటేశ్ వివరించారు.

రజనీకాంత్ చెప్పిన ఆ మాటలనే తాను స్ఫూర్తిగా తీసుకున్నానని వెంకటేశ్ పేర్కొన్నారు. అప్పటినుంచి ప్రచారం, పోస్టర్లు, కటౌట్ల వంటి ఆర్భాటాలకు తాను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని స్పష్టం చేశారు. "కేవలం మంచి కథలను ఎంచుకోవడం, నాణ్యమైన చిత్రాలు చేయడంపైనే నా పూర్తి ఏకాగ్రత ఉంటుంది. అదే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని నేను గట్టిగా నమ్ముతున్నాను" అంటూ తన విజయ రహస్యాన్ని పంచుకున్నారు. తాను మొదటి నుంచి ఆధ్యాత్మిక భావనలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని, ఈ విషయంలో రజనీకాంత్‌తో తనకు సారూప్యత ఉందని కూడా వెంకటేశ్ ఈ సందర్భంగా తెలిపారు. 
Venkatesh
Rajinikanth
Telugu Cinema
Success Story
Film Career
Movie Advice
Inspiration
Tollywood
Actor Venkatesh
Rajinikanth's advice

More Telugu News