Harshvardhan S Kikkeri: అమెరికాలో దారుణం.. భార్య, కుమారుడిని చంపి టెక్కీ ఆత్మహత్య

US Techie Kills Wife Son Then Himself
  • భార్య, 14 ఏళ్ల కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన టెక్కీ
  • అనంతరం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య
  • వాషింగ్టన్ రాష్ట్రంలో ఘటన
అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన టెక్ ఎంటర్‌ప్రెన్యూయర్ ఒకరు తన భార్యను, కుమారుడిని కాల్చి చంపి, అనంతరం తానూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని న్యూకాజిల్ పట్టణంలోని వారి నివాసంలో ఏప్రిల్ 24వ తేదీన ఈ దారుణ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులను హర్షవర్ధన ఎస్ కిక్కేరి (57), ఆయన భార్య శ్వేతా పాణ్యం (44), వారి 14 ఏళ్ల కుమారుడిగా గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో వీరి మరో కుమారుడు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. హర్షవర్ధన తొలుత భార్యను, కుమారుడిని కాల్చి చంపి, ఆ తర్వాత అదే తుపాకీతో తానూ కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ దారుణానికి పాల్పడటానికి స్పష్టమైన కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని కింగ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. ఆ కుటుంబం అందరితో స్నేహంగానే మెలిగేదని, అయితే తమ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా ఇతరులతో పంచుకునేవారు కాదని పొరుగువారు చెప్పినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

హర్షవర్ధన స్వస్థలం కర్ణాటకలోని మాండ్యా జిల్లా కేఆర్ పేట్ తాలూకా. రోబోటిక్స్ రంగంలో నిపుణుడైన ఆయన గతంలో అమెరికాలోని ప్రముఖ మైక్రోసాఫ్ట్ సంస్థలో కూడా పనిచేశారు. అనంతరం 2017లో భార్య శ్వేతతో కలిసి భారత్‌కు తిరిగి వచ్చి మైసూరు కేంద్రంగా 'హోలోవరల్డ్' అనే రోబోటిక్స్ కంపెనీని స్థాపించారు. శ్వేత కూడా ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరించారు.

సరిహద్దు భద్రతకు రోబోటిక్స్ టెక్నాలజీ వినియోగంపై గతంలో హర్షవర్ధన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి వివరించిన సందర్భం కూడా ఉంది. అయితే, కరోనా మహమ్మారి ప్రభావంతో 2022లో హోలోవరల్డ్ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయని, దీంతో హర్షవర్ధన తిరిగి అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది.
Harshvardhan S Kikkeri
Shweta Panyam
Washington
NewCastle
Murder-Suicide
India-US
Robotics
Tech Entrepreneur
King County Sheriff
Family Tragedy

More Telugu News