Subramaniam Swamy: పాకిస్థాన్ ను నాలుగు ముక్కలు చేయాలి: సుబ్రహ్మణ్యస్వామి సంచలన ట్వీట్

Swamy Calls for Breaking Pakistan into Four Parts
  • పాకిస్థాన్ ను విచ్ఛిన్నం చేయాలన్న సుబ్రహ్మణ్యస్వామి
  • బలూచిస్థాన్, సింధ్, పఖ్తూనిస్థాన్ స్వతంత్ర దేశాలుగా ఏర్పడాలని వ్యాఖ్య
  • పశ్చిమ పంజాబ్‌ను 'బకిస్థాన్'గా పేర్కొన్న స్వామి
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ, దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. పాకిస్థాన్ ను విచ్ఛిన్నం చేసి, నాలుగు ప్రాంతాలుగా విభజించాలంటూ ఆయన చేసిన సూచన ప్రకంపనలు సృష్టిస్తోంది.

"పాకిస్థాన్ ను విచ్ఛిన్నం చేయడమే మన దీర్ఘకాలిక లక్ష్యం" అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్, సింధ్, పఖ్తూనిస్థాన్ ప్రాంతాలు విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడాలని ఆయన అన్నారు. పాక్ లోని పశ్చిమ పంజాబ్ ప్రాంతాన్ని వ్యంగ్యంగా 'బకిస్థాన్' అని సంబోధిస్తూ, దానిని శత్రువుగా చూడాలని అభిప్రాయపడ్డారు.

ఈ ట్వీట్ ద్వారా, పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న వేర్పాటువాద ఉద్యమాలకు స్వామి పరోక్షంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా బలూచిస్థాన్, సింధ్, పఖ్తూనిస్థాన్ లలో దశాబ్దాలుగా స్వాతంత్ర్య ఆకాంక్షలు, అసంతృప్తి కొనసాగుతున్న నేపథ్యంలో స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బలూచిస్థాన్ ప్రాంతానికి చెందిన బలోచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు పాక్ ప్రభుత్వంతో పోరాడుతున్న విషయం తెలిసిందే. 

ఇదే తరహా అభిప్రాయాలను గతంలో ఇతర బీజేపీ నేతలు కూడా వ్యక్తం చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇటీవల మాట్లాడుతూ, బలూచిస్థాన్ స్వాతంత్ర్య ఉద్యమం కారణంగా పాకిస్థాన్ నుంచి విడిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కూడా 2025 నాటికి పాకిస్తాన్ మూడు ముక్కలవుతుందని (బలూచిస్థాన్, పఖ్తూనిస్థాన్, పంజాబ్) అభిప్రాయపడ్డారు. స్వామి తాజా ట్వీట్ ఈ చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.
Subramaniam Swamy
Pakistan
Baluchistan
Sindh
Pakhtoonistan
Partition of Pakistan
BJP
India-Pakistan Relations
Subramaniam Swamy Tweet
Pakistani Provinces

More Telugu News