Pakistanis: ఇండియా నుంచి వెళ్లిపోవడానికి పాకిస్థానీలకు ఈరోజే చివరి రోజు!

Last Day for Pakistanis to Leave India
  • పహల్గామ్‌లో ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు
  • భారత్‌లోని పాక్ పౌరుల వీసాలు రద్దు చేసిన కేంద్రం
  • దేశం విడిచి వెళ్లేందుకు పాకిస్థానీలకు ఏప్రిల్ 29 తుది గడువు
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, దేశ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో నివసిస్తున్న పాకిస్థాన్ జాతీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీరంతా నిర్దేశించిన గడువులోగా దేశం విడిచి తమ స్వదేశానికి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.

పాకిస్థాన్ పౌరులు భారత్ విడిచి వెళ్లేందుకు ఏప్రిల్ 29వ తేదీని తుది గడువుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యం తదితర కారణాలతో మెడికల్ వీసాలపై ఇక్కడకు వచ్చిన వారికి సైతం ఇదే గడువు వర్తిస్తుందని తెలిపింది. గడువులోగా దేశం విడిచి వెళ్లని పక్షంలో వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పాకిస్థాన్ పౌరులు ఇప్పటికే స్వదేశానికి తిరుగుముఖం పట్టారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో నివసిస్తున్న పాకిస్థాన్ జాతీయులను గుర్తించి, వారిని గడువులోగా పంపించేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ అధికారులు, నగరంలో నమోదై ఉన్న పాక్ పౌరుల వివరాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
Pakistanis
India
Visa Cancellation
Departure Deadline
April 29
Pakistan
India-Pakistan Relations
National Security
Home Ministry
Telangana Police

More Telugu News