కేర‌ళ ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి బాంబు బెదిరింపు

  • కేర‌ళ సీఎంఓతో పాటు స‌చివాల‌యానికి బాంబు బెదిరింపులు 
  • కొచ్చి ఎయిర్‌పోర్టుకు సైతం ఇదే మాదిరి బెదిరింపులు
  • ఆయా ప్ర‌దేశాల‌కు చేరుకుని బాంబ్ స్క్వాడ్‌, పోలీస్ బృందాలు గాలింపు చ‌ర్య‌లు
  • గ‌త రెండు వారాలుగా కేర‌ళ‌లోని ప్ర‌భుత్వ ఆఫీస్‌ల‌కు వ‌రుస‌ బాంబు బెదిరింపు కాల్స్
కేర‌ళ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంతో పాటు స‌చివాల‌యానికి నేడు బాంబు బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అటు, కొచ్చి ఎయిర్‌పోర్టుకు సైతం ఇదే మాదిరి బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో బాంబ్ స్క్వాడ్‌, పోలీస్ బృందాలు ఆయా ప్ర‌దేశాల‌కు చేరుకుని గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. 

కాగా, గ‌డిచిన‌ రెండు వారాలుగా కేర‌ళ‌లోని ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వ‌రుస‌గా బాంబు బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయి. ఇలా రెండు వారాల్లో ఏకంగా 12 బాంబు బెదిరింపు కాల్స్ వ‌చ్చిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. కేర‌ళ హైకోర్టు స‌హా జిల్లా క‌లెక్ట‌రేట్‌లు, రెవెన్యూ డివిజ‌న‌ల్ కార్యాల‌యాల‌కు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. 

నిన్న తిరువ‌నంత‌పురం విమానాశ్ర‌యంతో పాటు న‌గ‌రంలోని ప‌లు ప్ర‌ముఖ హోట‌ళ్ల‌కు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చిన‌ట్లు తెలిపారు. దాంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌లు ఎయిర్‌పోర్ట్ టెర్మిన‌ల్స్‌లో ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. 

అయితే, ఎటువంటి పేలుడు ప‌దార్థాలు ల‌భ్యం కాలేదు. దాంతో అవి న‌కిలీ బెదిరింపు కాల్స్‌గా గుర్తించామ‌ని పేర్కొన్నారు. ఇక‌, మే 2న రాష్ట్రంలో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ న‌కిలీ కాల్స్ పై పోలీసులు ద‌ర్యాప్తు వేగ‌వంతం చేశారు. 


More Telugu News