Gunjan Soni: యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా గుంజన్ సోనీ

YouTube hires Gunjan Soni as Country Managing Director for India
  • యూట్యూబ్ ఇండియా కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్‌గా గుంజన్ సోనీ నియామకం
  • వ్యాపారం, టెక్నాలజీ, మార్కెటింగ్‌లో రెండు దశాబ్దాల అనుభవం
  • గతంలో జలోరా గ్రూప్ సీఈఓ, స్టార్ ఇండియా ఈవీపీ, మింత్రా సీఎంఓగా పనిచేసిన గుంజన్
  • భారతదేశంలో యూట్యూబ్ వృద్ధి, ఆవిష్కరణలపై ప్రధాన దృష్టి
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్... ఇండియా కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్‌గా గుంజన్ సోనీని నియమించినట్లు సోమవారం ప్రకటించింది. వ్యాపారం, టెక్నాలజీ, మార్కెటింగ్, ఇ-కామర్స్ రంగాల్లో రెండు దశాబ్దాలకు పైగా నాయకత్వ అనుభవం కలిగిన గుంజన్, భారత్‌లో యూట్యూబ్ వృద్ధి, ఆవిష్కరణల బాధ్యతలను చేపట్టనున్నారు.

ఈ నియామకంపై యూట్యూబ్ ఆసియా పసిఫిక్ (APAC) వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ ఆనంద్ మాట్లాడుతూ, "భారతదేశంలో యూట్యూబ్ ప్రయాణం ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా సాగుతోంది. అపారమైన సృజనాత్మకత, సామర్థ్యం ఉన్న దేశమిది. మా తదుపరి వృద్ధి దశకు మార్గనిర్దేశం చేసేందుకు అనుభవజ్ఞురాలైన గుంజన్‌కు స్వాగతం పలుకుతున్నందుకు సంతోషంగా ఉంది" అని తెలిపారు. క్రియేటర్ ఎకానమీ, భారతదేశ వీడియో కామర్స్ రంగంపై ఆమెకున్న లోతైన అవగాహన, నాయకత్వ పటిమతో క్రియేటర్ల వృద్ధిని వేగవంతం చేయడానికి, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, వినియోగదారులను ఆకట్టుకోవడానికి, భారతదేశ డిజిటల్ ప్రయాణానికి మరింత తోడ్పడటానికి వీలు కలుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గుంజన్ సోనీ గతంలో సింగపూర్ కేంద్రంగా పనిచేసిన జలోరా (ZALORA) గ్రూప్‌కు ఆరేళ్లపాటు సీఈఓగా వ్యవహరించారు. అక్కడ ఆమె కొత్త కేటగిరీలు, వ్యాపార నమూనాలను పరిచయం చేయడంలో, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు ఆమె స్టార్ ఇండియాలో ఈవీపీగా, మింత్రాలో సీఎంఓగా కూడా పనిచేశారు. మెకిన్సీలో కన్స్యూమర్ అండ్ మార్కెటింగ్ విభాగంలో భాగస్వామిగానూ వ్యవహరించారు.

తన నియామకంపై గుంజన్ సోనీ స్పందిస్తూ, "భారతీయ క్రియేటర్ ఎకానమీకి ఎంతోకాలంగా మద్దతు ఇస్తున్న యూట్యూబ్‌లో చేరడం గౌరవంగా, ఉత్సాహంగా ఉంది. భారతదేశవ్యాప్తంగా క్రియేటర్లను యూట్యూబ్ శక్తివంతం చేస్తున్న తీరు, కమ్యూనిటీలను కలుపుతున్న విధానం స్ఫూర్తిదాయకం. ఈ పునాదిపై మరింత నిర్మిస్తూ, ఆవిష్కరణలను ప్రోత్సహించి, క్రియేటర్లకు కొత్త కథన అవకాశాలను అందించడంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోవడంలో యూట్యూబ్‌ పాత్రను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తాను" అని అన్నారు.
Gunjan Soni
YouTube
YouTube India
Managing Director
India
Creator Economy
Digital India
Video Commerce
ZALORA
Gautam Anand

More Telugu News