Pakistan Airlines: భారత్ పై ఆంక్షలు పెట్టి కోట్లాది డాలర్లు నష్టపోతున్న పాక్

Pakistans Sanctions on India Result in Millions of Dollars in Losses
  • పహల్గామ్ దాడి తర్వాత భారత విమానాల రాకపోకలపై పాక్ ఆంక్షలు
  • గగనతలం మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న దాయాది దేశం
  • భారత విమానయాన సంస్థల నుంచి ఏటా పొందే ఆదాయానికి గండి
  • ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లడం వల్ల భారత విమానాలకు పెరగనున్న ఇంధన ఖర్చులు
భారత్ ను దెబ్బతీయాలనే దురుద్దేశంతో పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. ఆ దేశానికి ఏటా వచ్చే కోట్లాది డాలర్ల ఆదాయానికి గండి పడింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తమ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలను నిషేధిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో భారత విమానాలు ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఈ నిర్ణయం వల్ల భారత విమానయాన సంస్థలపై భారం పడనుంది. విమాన ప్రయాణ సమయం, ఇంధన ఖర్చు పెరగనుంది. అదే సమయంలో ఈ నిర్ణయం వల్ల పాక్ కూడా భారీగా నష్ట పోతోందని, మొత్తంగా చూస్తే పాకిస్థాన్ పైనే దీని ప్రభావం ఎక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో భారత్‌ను ఇబ్బంది పెట్టాలని పాక్ తన గోతిని తానే తవ్వుకున్నట్లయిందని అంటున్నారు. 

విమానాలు ఒక దేశ గగనతలం మీదుగా ప్రయాణించినప్పుడు ఆ దేశానికి 'ఓవర్‌ఫ్లైట్ ఫీజులు' చెల్లించాల్సి ఉంటుంది. పశ్చిమ దేశాలకు వెళ్లే భారత విమానాలు ఎక్కువగా పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగిస్తుంటాయి. పాక్ గగనతలాన్ని వినియోగించుకున్నందుకు ఏటా మిలియన్ల డాలర్లు ఆ దేశానికి చెల్లిస్తుంటాయి. తాజా ఆంక్షల వల్ల పాక్ కు ఈ ఆదాయం నిలిచిపోనుంది. దీని ప్రభావం పాక్ ఆర్థిక వ్యవస్థపై గణనీయంగా ఉంటుందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.

పాక్ ప్రభుత్వ ఆంక్షల కారణంగా ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి భారత విమానయాన సంస్థలు తమ సర్వీసులను ప్రత్యామ్నాయ, సుదీర్ఘ మార్గాల్లో నడపాల్సి వస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ, అమృత్‌సర్, జైపూర్, లక్నో వంటి నగరాల నుంచి ఐరోపా, ఉత్తర అమెరికాకు వెళ్లే విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు పెరుగుతోంది. ఫలితంగా ఇంధన ఖర్చులు అధికమవుతున్నాయని విమానయాన సంస్థల అధికారులు తెలిపారు.

గతంలో 2019లో పుల్వామా దాడి తర్వాత కూడా పాకిస్థాన్ ఇదే విధంగా గగనతలాన్ని మూసివేసింది. అప్పట్లో దాదాపు 400 విమానాల రాకపోకలు ప్రభావితం కాగా, పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ), పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) సుమారు 100 మిలియన్ డాలర్ల మేర నష్టపోయినట్లు అంచనా. ప్రస్తుత చర్యలతో పాకిస్థాన్ మరోసారి అలాంటి ఆర్థిక నష్టాలనే ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Pakistan Airlines
Flight Restrictions
Overflight Fees
Pakistan
India
Aviation
Economic Impact
Air India
Indigo
Pulwama Attack

More Telugu News