Gudiband Leopard Sighting: సత్యసాయి జిల్లా గుడిబండలో చిరుతల కలకలం

Leopard Sighting Creates Panic in Gudiband Sathyasai District
గుడిబండ గ్రామంలో చిరుతల సంచారం
గ్రామానికి సమీపంలోని కొండపై గుంపుగా తిరుగుతున్న చిరుతలు
రాత్రి వేళల్లో పశువులపై దాడులు జరుగుతున్నాయని గ్రామస్తుల ఆందోళన
భయంతో పొలాలకు వెళ్లలేని పరిస్థితిలో రైతులు
అధికారుల స్పందన కరువు అని గ్రామస్తుల ఆరోపణ
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల కేంద్రం సమీపంలో చిరుతపులుల సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్న కొండపై చిరుతలు గుంపులుగా సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పరిణామంతో గుడిబండ వాసులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

గ్రామానికి దగ్గరలోని కొండ ప్రాంతంలోని పొదల్లో చాలా కాలంగా 3 చిరుతలు ఆవాసం ఏర్పరుచుకున్నాయని స్థానికులు తెలిపారు. పగటిపూట కొండపైనే ఉంటున్న చిరుతలు, రాత్రి సమయాల్లో ఆహారం కోసం గ్రామ పరిసరాల్లోకి వస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నివాస ప్రాంతాలకు సమీపంలోకి వచ్చి పశువులపై దాడులకు పాల్పడుతుండటంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో కొన్ని పశువులను చిరుతలు చంపినట్లు కూడా సమాచారం.

చిరుతల భయంతో రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. తమ ప్రాణాలకు, పశువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యపై అటవీశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని గుడిబండ వాసులు ఆరోపిస్తున్నారు. చిరుతల సంచారంపై ఫిర్యాదు చేసినా అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని, శాశ్వత పరిష్కారం చూపడం లేదని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, చిరుతల బెడద నుంచి తమను కాపాడాలని, గ్రామంలో భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Gudiband Leopard Sighting
Andhra Pradesh Leopards
Sathyasai District
Leopard Attacks
Wildlife Conflict
Gudiband Village
India Leopards
Forest Department
Animal Attacks

More Telugu News