Ghulam Rasool Magray: జమ్మూకశ్మీర్‌లో మరో దారుణం.. 43 ఏళ్ల వ్యక్తిపై ఆయన ఇంటి ముందే సాయుధుడి కాల్పులు

Jammu and Kashmir 43 Year Old Man Shot Near His Home
  • కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తి
  • పహల్గామ్ ఉగ్రదాడితో కశ్మీర్‌లో పెరిగిన ఆర్మీ కార్యకలాపాలు
  • బందిపొరా చెక్‌పాయింట్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల అరెస్ట్
జమ్మూకశ్మీర్‌లో మరో దారుణం జరిగింది. కుప్వారా జిల్లాలో 43 ఏళ్ల వ్యక్తిపై ఆయన ఇంటి సమీపంలో గుర్తు తెలియని సాయుధుడు తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని జీహెచ్ రసూల్ మాగ్రేగా గుర్తించారు. ఆయన పొత్తికడుపు, ఎడమ చేయి మణికట్టులోకి బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

పహల్గాం ఉగ్రదాడితో అప్రమత్తంగా ఉన్న ఆర్మీ ఆ ప్రాంతంలో మిలటరీ కార్యకలాపాలు పెంచింది. ఈ క్రమంలో తాజా ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకుంది. కాల్పుల వెనకున్న కారణం తెలియరాలేదు. కాగా, ఈ నెల 22న పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంలో గద్దర్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను ట్రాప్ చేసినట్టు తెలిసింది.

మరోవైపు, పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)తో సంబంధాలున్న ముగ్గురిని బందిపొరా చెక్‌పాయింట్‌లో భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి చైనీస్ పిస్టల్, రెండు మ్యాగజైన్లు, పలు రౌండ్ల తూటాలు, హ్యాండ్ గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. 
Ghulam Rasool Magray
Kupwara
Jammu and Kashmir
Terrorism
Shooting
Militants
Lashkar-e-Taiba
India
Pakistan
Military Operations

More Telugu News