Mallesham: ఈతకు వెళ్లి అన్నమయ్య జిల్లాలో నలుగురి మృతి

Four Drown in Annamayya District
  • ఈత కోసం నీటిలో దిగి మునిగిపోయిన ఇద్దరు పిల్లలు
  • ఇద్దరు పిల్లలు సహా తండ్రీ, మరో విద్యార్ధి మృతి
  • అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలంలో ఘటన
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మొలకలచెరువు మండలంలోని పెద్ద చెరువులో మునిగి నలుగురు మృతి చెందారు.

వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన మల్లేశ్ (36) బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలోని పెద్ద చెరువు వద్దకు వెళ్ళాడు. ఆయనతో పాటు కుమార్తె లావణ్య (12), కుమారుడు నందకిశోర్ (10), పిల్లల స్నేహితురాలు నందిని వెళ్ళారు. మల్లేశ్ బట్టలు ఉతుకుతుండగా, ఈత కొట్టేందుకు నందకిశోర్, నందిని చెరువులోకి దిగారు. వారు నీటిలో మునిగిపోతుండగా చూసిన లావణ్య పెద్దగా కేకలు వేస్తూ తమ్ముడిని రక్షించేందుకు ప్రయత్నిస్తూ నీటిలోకి దిగింది. వారి కేకలు విన్న మల్లేశ్ నీటిలో మునిగిపోతున్న ముగ్గురు పిల్లలను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

అయితే నీటిలో పాచి ఎక్కువగా ఉండటంతో పిల్లలను బయటకు తీసుకురాలేకపోయారు. మల్లేశ్ కూడా వారితో పాటు నీట మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను రప్పించి నలుగురి మృతదేహాలను బయటకు తీయించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, అతని ఇద్దరు పిల్లలతో పాటు పక్కింటి విద్యార్థిని మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 
Mallesham
Annamayya District
Drowning Incident
Tragedy
Child Drowning
Lavanya
Nandkishore
Nandini
Mulakalacheruvu Mandal
Andhra Pradesh

More Telugu News