Virat Kohli: కోహ్లీ, అనుష్క లండన్‌కు మకాం మార్చనున్నారా?.. మాధురి భర్త కీలక వ్యాఖ్యలు!

- విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లండన్‌కు మకాం మార్చే ఆలోచన
- భారత్‌లో తమ విజయాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించలేకపోవడమే కారణం
- పిల్లలను సాధారణ పద్ధతిలో పెంచాలనే కోరిక
- మాధురి దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరామ్ నెనే ఈ విషయాలు వెల్లడి
- కోహ్లీ చిన్ననాటి కోచ్ కూడా లండన్ మార్పును ధృవీకరించిన వైనం
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు తమ నివాసాన్ని లండన్‌కు మార్చాలని యోచిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ తాజాగా బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ భర్త, డాక్టర్ శ్రీరామ్ నెనే కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్, అనుష్క దంపతులు తమ పిల్లలను సాధారణ వాతావరణంలో పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ శ్రీరామ్ నెనే మాట్లాడుతూ, గతంలో అనుష్క శర్మతో జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. "విరాట్ అంటే నాకు చాలా గౌరవం. మేం చాలాసార్లు కలిశాం. ఆయన చాలా మంచి వ్యక్తి. అనుష్కతో ఓసారి మాట్లాడినప్పుడు ఆసక్తికర విషయం తెలిసింది. వారు లండన్‌కు మకాం మార్చాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, ఇక్కడ (భారత్‌లో) వారు తమ విజయాన్ని, పేరు ప్రఖ్యాతులను స్వేచ్ఛగా ఆస్వాదించలేకపోతున్నారు" అని డాక్టర్ నెనే వెల్లడించారు.
సెలబ్రిటీగా ఉండటం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. "వారు ఏం చేసినా అది పెద్ద వార్త అవుతుంది. దీనివల్ల వారు దాదాపు ఒంటరిగా అయిపోతారు. నాలాంటి వాళ్లు అందరితో కలిసిపోతారు, కానీ వారికి అది సవాలుగా మారుతుంది. ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు అడిగేవారు ఉంటారు. అది వారి వ్యక్తిగత సమయానికి ఇబ్బంది కలిగిస్తుంది. విరాట్, అనుష్క చాలా మంచి వ్యక్తులు. వారు కేవలం తమ పిల్లలను సాధారణంగా పెంచాలని కోరుకుంటున్నారు" అని డాక్టర్ నెనే వివరించారు.
ఇటీవల విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. విరాట్ తన భార్య, పిల్లలతో లండన్‌కు మకాం మార్చాలని యోచిస్తున్నారని, త్వరలోనే వారు భారత్ విడిచి వెళ్లే అవకాశం ఉందని ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఫిబ్రవరి 2024లో రెండో సంతానం అకాయ్ పుట్టిన తర్వాత కోహ్లీ, అనుష్క ఎక్కువగా లండన్‌లోనే గడుపుతుండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.