Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు హైకోర్టులో చుక్కెదురు

Kannada Actress Ranya Raos Bail Plea Rejected by Karnataka High Court

  • బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన నటి రన్యారావు
  • బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు
  • 14.7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ

బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు కర్ణాటక హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమెతో పాటు మరో నిందితుడు తరుణ్ కొండూరు రాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్ ఎస్. విశ్వనాథ్ శెట్టి ఈ మేరకు తీర్పు వెలువరించారు. డీఆర్ఐ అధికారుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, నిందితుల అభ్యర్థనలను తోసిపుచ్చారు.

గత నెలలో దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ రన్యారావు బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె వద్ద నుంచి సుమారు 14.7 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రన్యాతో పాటు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు.

అయితే, ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, తనను బెదిరించి ఇరికించారని రన్యారావు మొదట చెప్పినట్లు అధికారులు తెలిపారు. కానీ, డీఆర్ఐ లోతైన దర్యాప్తులో భాగంగా, ఈ బంగారం అక్రమ రవాణాలో రన్యారావు కొన్నేళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలిందని అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆమెకు బెయిల్ మంజూరు చేయవద్దని గట్టిగా వాదించారు.

ఈ కేసులో మూడో నిందితుడిగా (ఏ3) ఉన్న ఆభరణాల వ్యాపారి సాహిల్ జైన్‌ను కూడా డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బెయిల్ కోసం రన్యారావు చేసిన ప్రయత్నాలు ఇప్పటికే రెండుసార్లు విఫలమయ్యాయి. ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం, 64వ సెషన్స్ కోర్టులలో ఆమె బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తాజాగా హైకోర్టు కూడా బెయిల్ నిరాకరించింది.

Ranya Rao
Kannada Actress
Gold Smuggling
Karnataka High Court
Bail Rejection
Dubai
DRI
Tarun Konduru Raju
Sahil Jain
Bengaluru Airport
  • Loading...

More Telugu News