Pakistan PM: పహల్గామ్ దుర్ఘటనపై పాక్ ప్రధాని ఏమన్నారంటే..?

- ఉగ్రదాడి విషాదకరమన్న షెహబాజ్ షరీఫ్
- దాడి తర్వాత పాకిస్థాన్ పై నిందారోపణలు చేస్తున్నారని వ్యాఖ్య
- తటస్థ, పారదర్శక విచారణకు సిద్ధమని ప్రకటన
- చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న పాక్ ప్రధాని
పహల్గామ్ లో ఉగ్రదాడిపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. దుర్ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత తీరిగ్గా స్పందిస్తూ.. భారత్ తమపై నిందారోపణలు చేస్తోందని అన్నారు. పహల్గామ్ ఘటన విషాదకరమని అంటూనే భారత్ నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లినా ఎదుర్కొనేందుకు పాక్ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈమేరకు ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను షెహబాజ్ తప్పుపట్టారు.
ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామని, పహల్గామ్ దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమని ప్రకటించారు. ‘‘పహల్గామ్ లో జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం’’ అని షరీఫ్ తెలిపారు.
ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వదలబోమని, ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపైనా షెహబాజ్ స్పందించారు. పాకిస్థాన్ సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోమని, ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడం వంటి చర్యలతో భారత్ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు షెహబాజ్ చెప్పారు.