Brutal murder: విశాఖలో దారుణం... దంపతుల జంట హత్య

Brutal murder of a married couple in Visakhapatnam
  • విశాఖ గాజువాక సమీపంలోని రాజీవ్‌నగర్‌లో వృద్ధ దంపతుల హత్య
  • మృతులు గంపాల యోగేంద్రబాబు (66), లక్ష్మి (58)
  • రెండు రోజులుగా తలుపులు తీయకపోవడంతో వెలుగులోకి ఘటన
  • ఇంట్లో రక్తపు మడుగులో దంపతుల మృతదేహాలు లభ్యం
  • ఘటనా స్థలానికి క్లూస్ టీం, పోలీసుల దర్యాప్తు ప్రారంభం
విశాఖపట్నంలోని గాజువాక సమీపంలో ఉన్న రాజీవ్‌నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లోనే ఓ వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. రాజీవ్‌నగర్‌లో గత 35 ఏళ్లుగా నివాసం ఉంటున్న గంపాల యోగేంద్రబాబు (66), ఆయన భార్య లక్ష్మి (58)లను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. యోగేంద్రబాబు డాక్‌యార్డులో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈ దంపతులు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి, గురువారం ఉదయమే తిరిగి ఇంటికి చేరుకున్నారు.

అయితే, శుక్రవారం రాత్రి వరకు వారి ఇంటి తలుపులు మూసే ఉండటం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానిక బంధువుల అమ్మాయి ఇంటికి వచ్చి చూసింది. ఇంటికి రెండు వైపులా తాళాలు వేసి ఉండటాన్ని గమనించి, స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. సౌత్‌ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.

హాల్లో యోగేంద్రబాబు, బెడ్‌రూమ్‌లో లక్ష్మి రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. వారు అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులకు ఇద్దరు పిల్లలు కాగా, వారు వివాహాలు చేసుకుని అమెరికాలో స్థిరపడినట్లు తెలిసింది. దాదాపు 40 ఏళ్ల క్రితం ఈ దంపతులు కులాంతర వివాహం చేసుకున్నారు.

సమాచారం అందుకున్న క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన రోజే లేదా ఆ మరుసటి రోజే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
Brutal murder
Married couple
Visakhapatnam

More Telugu News