పరుగులు చేయలేకపోతున్నాం.. ధోనీ ఆవేదన!

  • చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం
  • చెపాక్‌లో సీఎస్కేకు ఇది వరుసగా నాలుగో ఓటమి
  • బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన సమస్య అని ధోనీ అంగీకారం
  • పరుగులు సరిపోవడం లేదని, ఆట తీరు మారిందని ధోనీ వ్యాఖ్య
  • ఈ విజయంతో ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వరుస ఓటములతో సతమతమవుతోంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) చేతిలో సొంతగడ్డపై ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే. మ్యాచ్ అనంతరం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ, తమ జట్టు వైఫల్యాలకు, ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యాలకు గల కారణాలను విశ్లేషించాడు.

ఈ సీజన్‌లో తమ జట్టు పలు సమస్యలతో ఇబ్బంది పడుతోందని, తక్కువ స్కోర్లు చేయడమే అతిపెద్ద సమస్యగా మారిందని ధోనీ అంగీకరించాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. యువ ఆటగాడు ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రేవిస్, చివర్లో దీపక్ హుడా మెరుపులు మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బౌలర్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చెపాక్‌లో సీఎస్కేకు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.

"చాలా మంది ఆటగాళ్లు ఒకేసారి విఫలమైతే జట్టులో మార్పులు చేయడం కష్టమవుతుంది. ఒకటి రెండు స్థానాల్లో సమస్య ఉంటే సర్దుబాటు చేయవచ్చు, కానీ ఎక్కువ మంది పరుగులు చేయలేకపోతే మార్పులు తప్పవు. మా బ్యాటర్లు తగినన్ని పరుగులు చేయలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యం. ఆట తీరు మారింది. ఎప్పుడూ 180-200 పరుగులు చేయాలని కాదు, కానీ పిచ్‌ను అంచనా వేసి, దానికి తగ్గట్టుగా పరుగులు సాధించాలి" అని ధోనీ విశ్లేషించాడు.

ప్రస్తుతం సీఎస్కే 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. మరోవైపు, ఈ విజయంతో సన్‌రైజర్స్ తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్‌లో అజేయంగా 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ "గత ఏడాది ఆర్‌సీబీ వరుసగా 7 మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరింది. ఈసారి మేమెందుకు అలా చేయకూడదు? ఇది మాకు చావో రేవో లాంటి మ్యాచ్. నూటికి నూరు శాతం కష్టపడతాం" అని  పేర్కొన్నాడు.


More Telugu News