Chandrababu Naidu: అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన చంద్రబాబు

Chandrababu Naidu Invites PM Modi for Amaravati Reconstruction
  • ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
  • ప్రధాని మోదీతో సమావేశం
  • వివిధ అంశాలపై చర్చ
ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం అండగా నిలుస్తారని, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు. పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చెప్పారు. నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమేరకు తన సంఘీభావాన్ని తెలిపారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని, హింసను ఖండిస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు. పహల్గామ్ బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపారు. భారతదేశ భద్రతను కాపాడే విషయంలో మోదీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. 

రాజధాని అభివృద్ధి పనులు వివరించిన సీఎం 

మే 2న చేపట్టే రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. అమరావతిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానికి వివరించారు. దీనిపై స్పందించిన ప్రధాని, రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు. అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని..., ఇందుకోసం మియావాకి విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పనులు పునఃప్రారంభించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి అంగీకారం తెలిపారు. 

మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని, ఆర్ఐఎన్ఎల్ గురించి ప్రధానికి సీఎం వివరించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌టీపీసి, ఆర్సెలర్ మిటల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌కు మద్దతు, అలాగే బీపీసీఎల్ రిఫైనరీ మంజూరు విషయంలోనూ ప్రధానికి ధన్యవాదాలు చెప్పారు. ఆరామ్‌కో భాగస్వామ్యాన్ని ఖరారు చేయడంతో అదనపు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈసారి రాష్ట్ర పర్యటనలో శ్రీశైలం కూడా సందర్శించాలని నరేంద్రమోదీని చంద్రబాబు కోరారు.

మోదీ రాక... భారీ ఏర్పాట్లకు ప్రణాళికలు

అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే రోజున దాదాపు 30 వేల మందితో ఒక రోడ్‌షో నిర్వహించాలని కూడా యోచిస్తున్నారు. ఇందులో మోదీ, చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రారంభమయ్యే లక్ష కోట్ల రూపాయల విలువైన పనులకు సూచికగా ప్రధాని మోదీ ఒక పైలాన్‌ను కూడా ఆవిష్కరించనున్నారు.

Chandrababu Naidu
Narendra Modi
Amaravati
Andhra Pradesh
Capital Development
Modi's Visit
AP Development
Polavaram Project
India Politics
National Politics

More Telugu News