Pahalgham Attack: పహల్గామ్ దాడి... సర్జికల్ స్ట్రైక్స్ సహా భారత్ ముందు ఉన్న ప్రత్యామ్నాయాలివే!

Pahalgham Attack Indias Response Options
  • పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతితో భారత్‌లో తీవ్ర స్పందన
  • పాకిస్థాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడి, సింధూ జలాల ఒప్పందం నిలిపివేత
  • భారత్ ప్రతిచర్యపై నిపుణుల విశ్లేషణలు
  • వైమానిక దాడులు, నియంత్రణ రేఖ దాటి ఆపరేషన్లు, సర్జికల్ స్ట్రైక్స్, ఫిరంగి దాడులు వంటివి ప్రత్యామ్నాయాలుగా చర్చ
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ లో మూడు రోజుల క్రితం జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

పహల్గామ్ దాడి అనంతరం, ఉగ్రవాదానికి ఊతమిస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌పై భారత్ దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య కీలకమైన సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేసింది. ఇది పాకిస్థాన్‌ను ఆర్థికంగా ఒత్తిడికి గురిచేసే చర్యగా భావిస్తున్నారు.

మరోవైపు, పహల్గామ్ మారణహోమానికి పాల్పడిన ఉగ్రవాదులకు తగిన రీతిలో బదులివ్వాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ ఎలాంటి సైనిక చర్యలకు దిగవచ్చనే దానిపై రక్షణ రంగ నిపుణులు పలు అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. వారి విశ్లేషణల ప్రకారం, భారత్ ముందు ప్రధానంగా నాలుగు రకాల సైనిక ప్రత్యామ్నాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది.

వైమానిక దాడులు

భారత వైమానిక దళం వద్ద ఉన్న అత్యాధునిక రఫేల్, సుఖోయ్, మిరాజ్ యుద్ధ విమానాలను ఉపయోగించి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు లేదా ఇతర కీలక లక్ష్యాలపై వైమానిక దాడులు చేయడం ఒక మార్గం. ఈ విమానాలకు శత్రువుల రక్షణ వ్యవస్థలను ఛేదించే సామర్థ్యం ఉంది. అయితే, గతంలో బాలాకోట్ దాడుల అనంతరం తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

నియంత్రణ రేఖ దాటి ఆపరేషన్లు

సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడతామని పాకిస్థాన్ ఇటీవల బెదిరింపు ధోరణికి పాల్పడింది. దీని ప్రకారం నియంత్రణ రేఖను గుర్తించనట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో భారత్ నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద శిబిరాలపై నేరుగా దాడులు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. నియంత్రణ రేఖ వద్ద పాక్ తరచూ జరుపుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలను కారణంగా చూపుతూ ఈ ఆపరేషన్లు చేపట్టవచ్చు. కానీ, ఈ ప్రాంతంలోని క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, బలమైన పాక్ సైనిక స్థావరాలు, ఆపరేషన్లకు పట్టే సుదీర్ఘ సమయం వంటివి సవాళ్లుగా మారే అవకాశం ఉంది.

నిర్దిష్ట లక్ష్యాలపై సర్జికల్ స్ట్రైక్స్

గతంలో మాదిరిగా, అత్యంత కీలకమైన, భారీ లక్ష్యాలను ఎంచుకుని వాటిపై పరిమిత స్థాయిలో మెరుపు దాడులు లేదా సర్జికల్ స్ట్రైక్స్ చేయడం మరో ప్రత్యామ్నాయం. అయితే, పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ సైన్యం, సరిహద్దుల్లోని ఉగ్రమూకలు మరింత అప్రమత్తంగా ఉండే అవకాశం ఉన్నందున, ఈ తరహా దాడుల్లో విజయం సాధించడం అనేది అత్యంత కచ్చితమైన ఇంటెలిజెన్స్, పటిష్టమైన ప్రణాళిక, ప్రత్యేక దళాల నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది.

ఫిరంగులు, స్నైపర్లతో దాడులు

నియంత్రణ రేఖ వెంబడి ఉన్న శత్రు సైనిక స్థావరాలు, ఉగ్రవాదుల చొరబాటు మార్గాలు, సరఫరా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని భారీ ఫిరంగులు, స్నైపర్ రైఫిల్స్, మోర్టార్లతో దాడులు జరపడం నాలుగో అవకాశంగా చెబుతున్నారు. ఈ రకమైన దాడులతో ఉద్రిక్తతలు పెద్దగా పెరిగే అవకాశం తక్కువగా ఉంటుందని, అయితే వీటి ప్రభావం కూడా పరిమితంగానే ఉండవచ్చని అంచనా.
Pahalgham Attack
India-Pakistan
Surgical Strikes
Airstrikes
Control Line Operations
Military Options
Terrorism
Jammu and Kashmir
Rafale
Mirage

More Telugu News