రావణుడి మాదిరి కొందరు ఎప్పటికీ మారరు... పాకిస్థాన్ నశించాల్సిందే: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

  • ఇది మత ఘర్షణ కాదు, ధర్మ-అధర్మాల మధ్య పోరాటమన్న మోహన్ భగవత్
  • దుష్టశక్తులను ఎదుర్కోవడానికి ఐక్యత అవసరమని వ్యాఖ్య
  • భారత ప్రభుత్వం తగిన జవాబిస్తుందని విశ్వాసం వ్యక్తం
పహల్గామ్ లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో జరిగిన ఈ హత్యలను తీవ్రంగా ఖండించిన ఆయన, ఇది కేవలం మతాల మధ్య యుద్ధం కాదని, ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రామాయణాన్ని ప్రస్తావించిన భగవత్, రావణుడు చివరి వరకు మారనట్లే, కొందరు దుర్మార్గులు కూడా మారరని ఉగ్రవాదులు, పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. "పాకిస్థాన్‌కు ఎన్నో అవకాశాలు ఇచ్చాం, అయినా వారు మారలేదు. అలాంటి వారు నశించాల్సిందే" అంటూ తీవ్ర స్వరంతో అన్నారు. ధర్మం అంటే సత్యం, న్యాయం, మానవతా విలువలు అని, కొన్ని చీకటి శక్తులు దేశంలో శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.

ఇలాంటి దాడులను నివారించడానికి, దుష్టశక్తులను నిలువరించడానికి సమాజంలో ఐక్యత అత్యంత కీలకమని భగవత్ నొక్కిచెప్పారు. "మనం ఐక్యంగా ఉంటే, ఎవరూ మనవైపు దురుద్దేశంతో చూసే సాహసం చేయరు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే, వారి కళ్లు పేలిపోతాయి" అని హెచ్చరించారు. ప్రజల భద్రత విషయంలో అంచనాలు ఉన్నాయని, అవి నెరవేరతాయని అన్నారు. పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం దీటుగా సమాధానం ఇస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.


More Telugu News