Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ముర్ము.. వాటికన్‌కు భారత బృందం

President Murmu attends Pope Francis Funeral
  • పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • వాటికన్ సిటీకి బయల్దేరిన భారత ప్రతినిధి బృందం
  • కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జార్జ్ కురియన్ కూడా పయనం
  • ఏప్రిల్ 26న అంత్యక్రియలు, భారత్‌లో సంతాప దినం
  • పోప్ మృతి పట్ల ప్రధాని మోదీ సహా పలువురి సంతాపం
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం వాటికన్ సిటీకి బయల్దేరి వెళ్లారు. ఆమె వెంట కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాషువా డిసౌజాలతో కూడిన భారత ప్రతినిధి బృందం కూడా వాటికన్‌కు పయనమైంది.

ఏప్రిల్ 21న పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటికన్‌లో ఏప్రిల్ 26న జరగనున్న ఆయన అంత్యక్రియల కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఆమె వాటికన్‌లో పర్యటిస్తారు. భారత ప్రభుత్వం, ప్రజల తరఫున పోప్ ఫ్రాన్సిస్‌కు నివాళులర్పించి, సంతాపం తెలియజేస్తారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 25న వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా వద్ద దివంగత పోప్‌కు రాష్ట్రపతి పుష్పాంజలి ఘటిస్తారు.

ఏప్రిల్ 26న సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగే అంత్యక్రియల ప్రార్థనలకు రాష్ట్రపతి హాజరవుతారు. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు విలియం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సహా పలు దేశాల అధినేతలు, రాజులు, ప్రముఖులు హాజరుకానున్నట్లు వాటికన్ వర్గాలు తెలిపాయి. సుమారు 130 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని అంచనా.

పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కరుణ, వినయం, ఆధ్యాత్మిక ధైర్యానికి పోప్ ప్రతీక అని కొనియాడారు. పేదలు, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్ గౌరవార్థం అంత్యక్రియలు జరిగే ఏప్రిల్ 26న భారత్‌లో సంతాప దినం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయనున్నారు. ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవు.
Pope Francis
Pope Francis Funeral
Draupadi Murmu
Vatican City
India
Kiren Rijiju
George Kurien
Joshua D'Souza
State Funeral
International dignitaries

More Telugu News