RCB: హోంగ్రౌండులో ఆర్‌సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. ఆ బ‌ల‌హీన‌త‌ను దాట‌లేక రాజ‌స్థాన్ చతికిల‌!

RCBs Grand Victory at Home
  • నిన్న చిన్న‌స్వామి స్టేడియంలో ఆర్‌సీబీ, ఆర్ఆర్ మ్యాచ్
  • 11 ప‌రుగుల తేడాతో ఆర్‌సీబీ గ్రాండ్ విక్ట‌రీ
  • 206 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్ఆర్‌ 194 ర‌న్స్‌కే ప‌రిమితం
  • హాఫ్ సెంచ‌రీల‌తో రాణించిన కోహ్లీ (70), ప‌డిక్క‌ల్ (50) 
  • ఈ మ్యాచ్‌లోనూ డెత్ ఓవ‌ర్ల బ‌లహీన‌త‌ను దాట‌లేక‌పోయిన రాజ‌స్థాన్‌
ఈ ఏడాది ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) ఎట్ట‌కేల‌కు హోంగ్రౌండ్ (చిన్న‌స్వామి స్టేడియం)లో గెలుపు బోణీ కొట్టింది. నిన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌)తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 11 ప‌రుగుల తేడాతో గెలిచింది. 206 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్ఆర్‌ను 194 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది. 

రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వీ జైస్వాల్ 49, ధ్రువ్ జురేల్ 47, నితీశ్ రాణా 28, రియాన్ ప‌రాగ్ 22 ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో హాజిల్‌వుడ్ 4 వికెట్లు ప‌డగొట్ట‌గా... కృనాల్ పాండ్యా 2, భువ‌నేశ్వ‌ర్‌, య‌శ్ ద‌యాల్ చెరో వికెట్ తీశారు. 

అంత‌కుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ (70), దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (50) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్ 26 ర‌న్స్ చేయ‌గా... చివ‌ర్లో టిమ్ డేవిడ్ (23), జితేశ్ శ‌ర్మ (20) బౌండ‌రీల‌తో మెరిపించారు. ఆర్ఆర్ బౌల‌ర్ల‌లో సందీప్ శ‌ర్మ 2 వికెట్లు తీశారు. 

అనంత‌రం 206 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్‌కు ఓపెన‌ర్లు జైస్వాల్‌, సూర్య‌వంశీ శుభారంభం అందించారు. ఈ ద్వ‌యం తొలి వికెట్‌కు 52 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. ఆ త‌ర్వాత వ‌రుస విరామాల్లో వికెట్లు పారేసుకోవ‌డంతో ఏ ద‌శ‌లోనూ ఆర్ఆర్ ల‌క్ష్యం దిశ‌గా సాగ‌లేదు. 

అదే స‌మ‌యంలో మ‌రోసారి డెత్ ఓవ‌ర్ల‌లో బోల్తాప‌డే బ‌ల‌హీన‌త‌ను ఈ మ్యాచ్‌లోనూ రాజ‌స్థాన్ దాట‌లేక చతికిల ప‌డింది. చివ‌రి 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి ఉండ‌గా... 11 ర‌న్స్ తేడాతో ప‌రాజ‌యం పాలైంది. కాగా, సొంత‌ మైదానంలో తొలి మూడు మ్యాచ్‌ల‌లో ఓడిన ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో మాత్ర‌మే సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. 

ఇక‌, ఈ విజ‌యంతో బెంగ‌ళూరు పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానానికి ఎగ‌బాకింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 9 మ్యాచ్‌ల‌లో 6 విజ‌యాలు న‌మోదు చేసింది. మ‌రోవైపు రాజ‌స్థాన్ ఆడిన 9 మ్యాచ్‌ల‌లో కేవ‌లం 2 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతోంది. 
RCB
Royal Challengers Bangalore
Rajasthan Royals
IPL 2023
Virat Kohli
Faf du Plessis
IPL Match
Cricket
Chinnaswamy Stadium
Yashasvi Jaiswal

More Telugu News