Naga Babu: పహల్గామ్ ఉగ్రదాడి అత్యంత హేయం: కొణిదెల నాగబాబు

- పహల్గామ్ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర మనో వేదనకు గురయ్యారన్న నాగబాబు
- హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
- ఘటనకు కారకులను కఠినంగా శిక్షించి బలమైన పాఠం చెప్పాలి
- మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
జమ్మూకశ్మీర్‌లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కె. నాగబాబు స్పష్టం చేశారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ, మృతులకు సంతాపం తెలియజేయాలన్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో నాగబాబు పాల్గొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి హేయమైన చర్య అని అన్నారు. ఈ ఘటన పట్ల పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారన్నారు. ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించి, బలమైన గుణపాఠం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాల వేదన కలచివేస్తోందని, మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం, తెలంగాణ నాయకులు సాగర్ ఆర్. కె. నాయుడు, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, రాధారం రాజలింగం, దామోదర్ రెడ్డి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.