General Asim Munir: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కు, బిన్ లాడెన్ కు తేడా లేదు: అమెరికా మాజీ అధికారి

Pakistan Army Chief Compared to Bin Laden by Former US Official
  • పాకిస్థాన్ అసలు స్వరూపం ప్రపంచానికి తెలుసన్న రూబిన్
  • పాక్ ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా ప్రకటించాలని యూఎస్ ప్రభుత్వానికి సూచన
  • పాక్ ఆర్మీ చీఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని వ్యాఖ్య
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి ఘటన అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ దాడి నేపథ్యంలో అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ మాజీ అధికారి మైఖేల్ రూబిన్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్‌ఖైదా మాజీ చీఫ్, కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు, జనరల్ మునీర్‌కు మధ్య పెద్దగా తేడా లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.

"ఒసామా బిన్ లాడెన్ గతంలో ఓ కలుగులో దాక్కుని కార్యకలాపాలు సాగిస్తే, ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. ఇదొక్కటే వారిద్దరి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం" అని రూబిన్ వ్యాఖ్యానించారు. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించిన రూబిన్, ఈ తరహా ఘటనలు గతంలోనూ జరిగాయని గుర్తు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనలో ఉన్నప్పుడు కశ్మీర్‌లో ఇలాంటి దాడి జరిగిందని, మళ్లీ ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటిస్తున్న తరుణంలోనే ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

పహల్గామ్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇది స్థానికంగా జరిగిన ఘటనేనని పాకిస్థాన్ చేస్తున్న వాదనలను రూబిన్ తోసిపుచ్చారు. "ఇలాంటి నాటకాలు పాకిస్థాన్ ఎన్ని ఆడినా, ఆ దేశ అసలు స్వరూపం ప్రపంచానికి తెలుసు" అని అన్నారు. ఈ దాడికి అమెరికా స్పందించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పిన ఆయన, "పాకిస్థాన్‌ను తక్షణమే ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా ప్రకటించాలి. అదేవిధంగా, పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలి" అని అమెరికా ప్రభుత్వానికి సూచించారు.

ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యల తర్వాతే పహల్గామ్ దాడి జరగడం గమనార్హం. ఓవర్సీస్ పాకిస్థాన్ కన్వెన్షన్‌లో మునీర్ మాట్లాడుతూ, "కశ్మీర్ గతంలోనూ, భవిష్యత్తులోనూ మా జీవనాడి. దానిని మేం ఎప్పటికీ మరువలేం. మా కశ్మీరీ సోదరుల పోరాటంలో వారిని ఒంటరిగా వదిలిపెట్టం" అని వ్యాఖ్యానించారు. భారత్‌పై తీవ్ర వ్యతిరేకత కలిగిన వ్యక్తిగా మునీర్‌కు పేరుందని, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పహల్గాం దాడికి పురిగొల్పాయా అనే కోణంలో అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.
General Asim Munir
Pakistan Army Chief
Osama Bin Laden
Michael Rubin
Pakistan Terrorism
Pulwama Attack
Kashmir Terrorism
US-Pakistan Relations
India-Pakistan Conflict
International Terrorism

More Telugu News