మెరిసిన ఢిల్లీ టాపార్డర్... లక్నో జట్టుపై ఈజీ విన్

  • లక్నోలో మ్యాచ్
  • 8 వికెట్ల  తేడాతో నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
  • 160 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో కొట్టేసిన ఢిల్లీ టీమ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి సునాయాసంగా గెలుపొందింది.

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 

అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలోనే 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 

ఓపెనర్ కరుణ్ నాయర్ (15) త్వరగానే ఔటైనా, మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్సర్), వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (42 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో మెరిశారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 

పోరెల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ (20 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రాహుల్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. లక్నో బౌలర్లలో ఐడెన్ మార్క్రమ్ రెండు వికెట్లు పడగొట్టాడు.


More Telugu News