చెన్నై సూపర్ కింగ్స్‌కు గెలవాలనే కసి లేదు: సురేశ్ రైనా విమర్శలు

  • ఐపీఎల్ 2025లో ప్రదర్శనపై విమర్శలు
  • జట్టులో గెలుపు పట్ల కసి, తీవ్రత లేవని విమర్శ
  • ఇది అత్యంత బలహీనమైన జట్టు అన్న హర్భజన్ వాదనతో ఏకీభవించిన రైనా
  • స్థానిక ప్రతిభను విస్మరించడాన్ని తప్పుబట్టిన రైనా
చెన్నై సూపర్ కింగ్స్‌కు గెలవాలనే తపన కొరవడిందని ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత ఐపీఎల్ 2025 సీజన్‌లో జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో గెలుపు పట్ల ఉండాల్సిన కసి, నిబద్ధత లోపించాయని విమర్శించాడు. మాజీ సహచరుడు హర్భజన్ సింగ్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడిన రైనా, ప్రస్తుత చెన్నై జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత బలహీనంగా కనిపిస్తోందన్న హర్భజన్ సింగ్ అభిప్రాయంతో ఏకీభవించాడు.

ఈ సీజన్‌లో తీవ్రంగా తడబడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన తొలి ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లలోనూ గెలవాల్సిన పరిస్థితి ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చాలా బలహీనంగా ఉందని, ఎవరినీ అగౌరవపరచాలనే ఉద్దేశం తనకు లేదని రైనా స్పష్టం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్‌కు తగినట్లుగా వారి ఆట తీరు లేదని అభిప్రాయపడ్డాడు.

మెగా వేలంలో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ, సరైన యువ ప్రతిభను గుర్తించడంలో జట్టు విఫలమైందని విమర్శించాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు సైతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారని అన్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రాణించిన స్థానిక ఆటగాళ్లను విస్మరించడాన్ని రైనా తప్పుబట్టాడు.

గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న సాయి సుదర్శన్, సాయి కిషోర్, షారుక్ ఖాన్‌లు అద్భుతంగా రాణిస్తున్నారని, వారంతా తమిళనాడు ప్రీమియర్ లీగ్ నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశాడు. స్థానిక ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావాలని సూచించాడు. గతంలో మురళీ విజయ్, బాలాజీ, బద్రీనాథ్, అశ్విన్ వంటి స్థానిక ఆటగాళ్లతోనే జట్టు విజయాలు సాధించిందని గుర్తు చేశాడు.

అంతేకాకుండా, పవర్‌ప్లే ఓవర్లలో జట్టు దూకుడుగా ఆడకపోవడాన్ని, డాట్ బాల్స్ ఎక్కువగా ఆడటాన్ని రైనా తప్పుబట్టాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో ఆధిపత్యం చెలాయించేదని, స్ట్రైక్ రొటేషన్‌తో పాటు కీలక సమయాల్లో దూకుడుగా ఆడటం ముఖ్యమని పేర్కొన్నాడు. ఈ వైఫల్యాలే జట్టు ఓటములకు ప్రధాన కారణమని రైనా విశ్లేషించాడు.


More Telugu News