"ఓ హాట్ గర్ల్ నుంచి మెసేజ్ వస్తే అతడ్ని బ్లాక్ చేయండి"... ఆసక్తికర మీమ్ షేర్ చేసిన ఎలాన్ మస్క్

  • క్రిప్టో కరెన్సీ మోసాలపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ హెచ్చరిక
  • ఆకర్షణీయమైన అమ్మాయిల ఫేక్ ప్రొఫైల్స్‌తో వల విసురుతారని వెల్లడి 
  • 2023లో క్రిప్టో మోసాల్లో $3.9 బిలియన్ల నష్టం వాటిల్లిందన్న ఎఫ్‌బీఐ నివేదిక
క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాల గురించి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఒక ఆసక్తికరమైన మీమ్‌ను తన 'ఎక్స్' ఖాతాలో పంచుకున్నారు. గ్రీకు సముద్ర దేవుడు పోసిడాన్ చిత్రంతో ఉన్న ఆ మీమ్‌లో... "ఒక పాత సామెత ఉంది, ఏదైనా హాట్ గర్ల్ మీకు క్రిప్టో గురించి సందేశం పంపిస్తే, అతడిని బ్లాక్ చేయండి" అని రాసి ఉంది. 

మోసగాళ్లు తరచుగా ఆకర్షణీయమైన అమ్మాయిల పేరుతో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, ఇన్వెస్టర్లను ఎలా వలలో వేసుకుంటున్నారో ఈ పోస్ట్ ద్వారా,  మస్క్ పరోక్షంగా హెచ్చరించారు. ఈ పోస్ట్ కొద్ది సమయంలోనే వైరల్‌గా మారి, మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించింది.

ఇటీవలి కాలంలో క్రిప్టో కరెన్సీ మోసాలు బాగా పెరిగాయి. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ ఇంటర్నెట్ క్రైమ్ కంప్లైంట్ సెంటర్ (IC3) నివేదిక ప్రకారం... కేవలం 2023లోనే క్రిప్టో సంబంధిత పెట్టుబడి మోసాల వల్ల బాధితులు సుమారు 3.9 బిలియన్ డాలర్లు నష్టపోయారని అంచనా. 

అధిక రాబడి లేదా గ్యారెంటీ లాభాలు ఇస్తామని నమ్మబలకడం, నకిలీ టెస్టిమోనియల్స్, ఆకర్షణీయమైన వెబ్‌సైట్లు, కొన్నిసార్లు కృత్రిమ మేధ (AI)తో సృష్టించిన సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్‌లను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. డబ్బు బదిలీ అయిన తర్వాత మోసగాళ్లు అదృశ్యమవుతున్నారు.




More Telugu News