బాబా రామ్‌దేవ్ పై ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే!

  • హ‌మ్‌దర్ద్ పానీయం విష‌యంలో రామ్‌దేవ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు
  • ఆయ‌న వ్యాఖ్య‌లు షాక్‌కు గురిచేశాయ‌న్న న్యాయ‌స్థానం
  • ఏమాత్రం స‌మ‌ర్థ‌నీయం కావ‌ని స్పష్టీకరణ
యోగా గురువు బాబా రామ్‌దేవ్ పై ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హ‌మ్‌దర్ద్ పానీయం విష‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు షాక్‌కు గురిచేశాయ‌ని, ఏమాత్రం స‌మ‌ర్థ‌నీయం కావ‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. 

వివ‌రాల్లోకి వెళితే... కొన్నిరోజుల క్రితం బాబా రామ్‌దేవ్... హ‌మ్‌దర్ద్ ష‌ర్బ‌త్ గురించి ప‌రోక్షంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దానిని కోనుగోలు చేయ‌డం ద్వారా వ‌చ్చే లాభాల‌ను ఆ సంస్థ మ‌రో వేరొక వ‌ర్గానికి చెందిన నిర్మాణాల‌ను చేప‌ట్టేందుకు ఉప‌యోగిస్తుంద‌ని ఆరోపించారు. 

అదే ఈ ష‌ర్బ‌త్ (పతంజ‌లి సంస్థ‌కు చెందిన పానీయం) తాగితే గురుకులాల‌ను నిర్మించ‌వ‌చ్చు, ప‌తంజ‌లి విశ్వ‌విద్యాల‌యాన్ని విస్త‌రించ‌వ‌చ్చు అని ఆయ‌న అన్నారు. రామ్‌దేవ్ బాబా మాట్లాడిన వీడియో వివాదాస్ప‌ద‌మైంది. ఈ క్ర‌మంలో హ‌మ్‌దర్ద్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది. త‌క్ష‌ణ‌మే సోష‌ల్ మీడియా నుంచి ఆ వీడియోను తొల‌గించేలా ఆదేశించాల‌ని తెలిపింది. 

హ‌మ్‌దర్ద్ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించారు. ఇది ఆ సంస్థ ఉత్ప‌త్తిని అగౌర‌వ‌ప‌ర‌చ‌డం కంటే తీవ్ర‌మైంద‌ని, అవి ద్వేష‌పూరిత వ్యాఖ్య‌ల కిందికే వ‌స్తాయ‌ని వాదించారు. దీనిపై స్పందించిన కోర్టు... "బాబా రామ్‌దేవ్ వ్యాఖ్య‌లు కోర్టు అంత‌రాత్మ‌ను షాక్‌కు గురి చేశాయి. ఇలాంటి వ్యాఖ్య‌లు ఎంత‌మాత్రం స‌మ‌ర్థ‌నీయం కాదు" అని పేర్కొంది. 


More Telugu News