Kesineni Nani: సొంత తమ్ముడు ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆరోపణలు

Kesineni Nanis Serious Allegations Against Brother Kesineni Chinni
  • కేశినేని చిన్నిపై నాని తీవ్ర ఆరోపణలు
  • ఉర్సా భూ కేటాయింపులపై కేశినేని నాని ఫైర్
  • విశాఖ భూ కేటాయింపులు బినామీ డీల్ అని ఆరోపణ
తన సొంత తమ్ముడు, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లక్ష్యంగా మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖపట్నంలో 'ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థకు భారీగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని, దీని వెనుక ఎంపీ చిన్ని ఉన్నారని నాని ఆరోపించారు. ఇది పెట్టుబడుల ముసుగులో ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నమని ఆయన విమర్శించారు.

విశాఖలో రూ. 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరుతో ఉర్సా క్లస్టర్స్ సంస్థకు మొత్తం 60 ఎకరాల భూమిని కేటాయించేందుకు రంగం సిద్ధమైందని వార్తలు వస్తున్నాయని కేశినేని నాని తెలిపారు. ఇందులో ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఈ ఉర్సా క్లస్టర్స్ అనేది కేవలం కొన్ని వారాల క్రితమే నమోదైన సంస్థ అని, దానికి ప్రాజెక్టును చేపట్టే అనుభవం గానీ, ఆర్థిక సామర్థ్యం గానీ లేవని నాని అన్నారు.

ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, ఎంపీ కేశినేని చిన్నికి ఇంజినీరింగ్ క్లాస్‌మేట్ అని, అంతేకాకుండా వ్యాపార భాగస్వామి కూడా అని నాని ఆరోపించారు. గతంలో వీరిద్దరూ కలిసి '21st సెంచరీ ఇన్వెస్ట్‌మెంట్స్, ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారని నాని ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే తరహాలో 'ఉర్సా' పేరుతో ప్రభుత్వ భూమిని బినామీ పద్ధతిలో చేజిక్కించుకునేందుకు చిన్ని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఈ భూ కేటాయింపుల వెనుక ఎంపీగా తనకున్న అధికారాన్ని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడిగా తనకున్న పరపతిని చిన్ని దుర్వినియోగం చేస్తున్నారని నాని ఆరోపించారు. అంతేకాకుండా ఇసుక, ఫ్లై యాష్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కుమ్మక్కై చిన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు కూడా ఫిర్యాదులున్నాయని పేర్కొన్నారు.

ఉర్సా క్లస్టర్స్‌కు భూ కేటాయింపుల ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. ఆ కంపెనీ యజమానులు, వారి ఆర్థిక మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. పెట్టుబడుల పేరుతో ప్రభుత్వ భూమిని దోచుకునే ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కోరుతూ నాని ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.
Kesineni Nani
Kesineni Chinni
Visakhapatnam Land Scam
Ursa Clusters Private Limited
Andhra Pradesh Politics
TDP MP
YSRCP
Data Center Project
Government Land Allotment
Abburi Satish

More Telugu News