హైదరాబాద్‌లో ఈ-సిగరెట్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్, అమెరికన్ డాలర్లు సీజ్

  • ఈ-సిగరెట్లు, వేప్‌లను విక్రయిస్తున్న ముఠా అరెస్టు
  • యువత, విద్యార్థులే లక్ష్యంగా కార్యకలాపాలు
  • వాట్సాప్‌లో ప్రత్యేక గ్రూప్‌తో విక్రయం
  • నిందితుల నుంచి అమెరికన్, కెనడియన్ డాలర్లు స్వాధీనం
హైదరాబాద్ నగరంలో నిషేధిత ఈ-సిగరెట్లు (వేప్‌లు) అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) అధికారులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ముఖ్యంగా విద్యాసంస్థల సమీపంలో యువత, విద్యార్థులే లక్ష్యంగా ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముఠా సభ్యులు నగరంలోని పలు కళాశాలలు, పాఠశాలల వద్ద యువతను ఆకర్షించి వారికి ఈ-సిగరెట్లు, వేపింగ్ పరికరాలను విక్రయిస్తున్నారు. ఇందుకోసం 'ఎస్‌ఐడీ' అనే పేరుతో ఒక ప్రత్యేక వాట్సప్ గ్రూప్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ గ్రూప్ ద్వారా సుమారు 500 మందికి పైగా వినియోగదారులకు ఈ నిషేధిత ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారని అధికారులు గుర్తించారు.

అరెస్టయిన నిందితులు హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతానికి చెందిన అన్నదమ్ములుగా పోలీసులు గుర్తించారు. వీరికి ఢిల్లీకి చెందిన అమిత్, ముంబైకి చెందిన వసీం అనే వ్యక్తులు ప్రధాన సరఫరాదారులుగా వ్యవహరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ద్వారా ఈ నిషేధిత ఉత్పత్తులను నగరానికి తెప్పించి ఇక్కడ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

నిందితుల నుంచి సుమారు రూ. 25 లక్షల విలువైన ఈ-సిగరెట్లు, వేపింగ్ పరికరాలు, వాటికి సంబంధించిన లిక్విడ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 225 అమెరికన్ డాలర్లు, 100 కెనడియన్ డాలర్ల విదేశీ కరెన్సీని కూడా సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


More Telugu News