ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన రోహిత్‌... తొలి భార‌త‌ ఆట‌గాడి న‌యా రికార్డ్‌!

  • నిన్న సీఎస్‌కే, ఎంఐ మ్యాచ్‌
  • అజేయంగా 76 ర‌న్స్ చేసిన హిట్‌మ్యాన్‌
  • ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం
  • ఐపీఎల్ లో అత్య‌ధిక పీఓటీఎం (20)లు సాధించిన భార‌త ప్లేయ‌ర్‌గా రోహిత్ రికార్డ్‌
ఐపీఎల్ 18వ సీజ‌న్ ఈసారి అభిమానుల‌కు మంచి కిక్ ఇస్తోంది. భారీ అంచ‌నాలు ఉన్న జ‌ట్లు బేజారు అవుతుంటే... ఎలాంటి అంచ‌నాలు లేని జ‌ట్లు మంచి విజయాల‌తో దూసుకెళ్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆదివారం ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే), ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు జ‌రిగింది. 

ఈ మ్యాచ్ లో చెన్నైను ముంబ‌యి ఏకంగా 9 వికెట్ల తేడాతో మ‌ట్టిక‌రిపించింది. దీంతో సీఎస్‌కే ప్లేఆఫ్ అవ‌కాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్ లు ఆడిన చెన్నై కేవ‌లం రెండు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగున ఉంది. మ‌రోవైపు ఎంఐ ఈ విజ‌యంతో ప్లేఆఫ్ అవ‌కాశాల‌ను మెరుగుప‌ర‌చుకుంది. 

ఇక‌, ఈ మ్యాచ్ లో అజేయంగా 76 ప‌రుగులు బాదిన రోహిత్ శ‌ర్మ‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఇది అతనికి ఐపీఎల్‌లో 20వ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ (పీఓటీఎం). త‌ద్వారా హిట్‌మ్యాన్ త‌న ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు. ఐపీఎల్ అత్య‌ధిక పీఓటీఎంలు సాధించిన భార‌త ఆట‌గాడిగా నిలిచారు. 

ఓవ‌రాల్‌గా ఈ జాబితాలో ఏబీ డివిలియ‌ర్స్ (25), క్రిస్ గేల్ (22) త‌ర్వాత రోహిత్‌ మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. అత‌ని త‌ర్వాత విరాట్ కోహ్లీ (19) ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడు. అలాగే ఐపీఎల్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో శిఖ‌ర్ ధావ‌న్‌(6,769)ను వెన‌క్కి నెట్టి 6,786 ర‌న్స్ తో హిట్‌మ్యాన్ రెండో స్థానానికి ఎగ‌బాకాడు. ఈ జాబితాలో కింగ్ కోహ్లీ 8,326 ప‌రుగుల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.      


More Telugu News