Jayachandra: యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్స్

- సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో ఘటన
- ఆన్‌లైన్ గేమ్స్ కోసం రూ. 3 లక్షల అప్పు
- తీర్చే మార్గం లేక రైలు కిందపడి ఆత్మహత్య
ఆన్‌లైన్ గేమ్స్‌కు మరో యువకుడు బలయ్యాడు. ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న అతడు మరో మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పరిగి మండలంలోని పైడేటి గ్రామానికి చెందిన 23 ఏళ్ల జయచంద్ర డిగ్రీ వరకు చదువుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం గ్రామంలో డెయిరీ ప్రారంభించి నడుపుతున్నాడు.
పాడి రైతుల నుంచి సేకరించిన పాలకు సంబంధించి రైతులకు 3 లక్షల రూపాయల వరకు బాకీ పడ్డాడు. దీంతో వారి నుంచి ఒత్తిడి పెరిగింది. మరోవైపు ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడి రూ. 3 లక్షలు అప్పు చేసి నష్టపోయాడు. దీంతో నెల రోజుల క్రితం డెయిరీని మూసేశాడు. ఉద్యోగం కోసం బెంగళూరు వెళుతున్నట్టు చెప్పి శనివారం ఇంటి నుంచి బయలుదేరాడు. అదే రోజు రాత్రి హిందూపురం పట్టణ పరిధిలోని గుడ్డం సమీపంలో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు ముందు జయచంద్ర తన చొక్కాపై ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని రాశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.