Rohit Sharma: ఫాంలోకి వచ్చిన హిట్ మ్యాన్, సూర్య మెరుపు దాడి... ఈజీగా ఛేజింగ్ చేసిన ముంబయి

- చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం
- రోహిత్ శర్మ (76*), సూర్యకుమార్ యాదవ్ (68*) అజేయ అర్ధ సెంచరీలు
- 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించిన ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా ఆదివారం నాడు వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ధ శతకాలతో చెలరేగి జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. చెన్నై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 15.4 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్... చెన్నై సూపర్ కింగ్స్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్సర్), రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు.
రికెల్టన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ చెన్నై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. రెండో వికెట్‌కు అజేయంగా 114 పరుగులు జోడించి మరో 26 బంతులు మిగిలి ఉండగానే ముంబైకి చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా ఒక్కడే వికెట్ తీయగలిగాడు. మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ముంబయికి ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం.